వీసీ పదవికి రూ.14 కోట్ల లంచం !
చెన్నై: వీసీ పదవికి రూ.14 కోట్ల వరకు లంచం చేతులు మారుతున్నట్లు టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన చెన్నై సత్యమూర్తి భవన్‌లో మంగళవారం ఉదయం రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ వర్గాలకు, ప్రజలకు మిఠాయిలను పంచిపెట్టారు.
సేవాదళ కాంగ్రెస్ నిర్వహించిన పెరేడ్‌ను తిలకించారు. అనంతరం ఇళంగోవన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, ప్రజలు అధికార మార్పుకు సన్నద్ధమయ్యారన్నారు. అవినీతి రహిత పాలన అందజేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్య భాగస్వామ్యం వహిస్తుందన్నారు.
రాష్ట్రంలోగల విద్యాసంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని, విద్యా సంస్థల ద్వారా ప్రభుత్వం ధనార్జనకు పాల్పడుతోందని విమర్శించారు. వర్సిటీ వైస్ చాన్సలర్ పదవికి రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు లంచం తీసుకుంటున్నారని, ఈ విధంగా ఎంపికయ్యే వైస్ చాన్సలర్లు వ్యాపారుల్లా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. పేద, దళిత వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు సుముఖంగా లేరని తెలిపారు.
అందుచేత విద్యారంగంలో అవినీతికి పాల్పడని ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. నటుడు రజనీకాంత్‌కు గతంలోనే పద్మవిభూషణ్ వస్తుందని భావించామని, అయితే ఆలస్యంగా ఆ పదవి అతన్ని వరించిందన్నారు. ఈ అవార్డు లభించడంతో ఆయన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కోశాధికారి నాసే రామచంద్రన్, నటి కుష్బు, గోపన్న తదితరులు పాల్గొన్నారు.