రైల్వే ట్రాక్ ఎక్కితే ఏనుగైనా పీనుగే
బరంపురం : రాష్ట్రంలో మూగజీవాలకు రక్షణ లేకుండా పోతోంది. రైల్వేట్రాక్‌లపై గజరాజులు మృత్యువాత పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జంతు ప్రేమికులు, రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రంలో గల రైల్వే ట్రాక్‌పై వివిధ ప్రాంతాల్లో గత 7 ఏళ్లలో జరిగిన దుర్ఘటనల్లో ఇప్పటి వరకు సుమారు 22 ఏనుగులు మృతి చెందిన సంఘటనలు జంతు ప్రేమికులను కలిచివేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఝార్సుగుడ జిల్లాలోని బగ్గిధి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 4 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. ముఖ్యంగా ఏనుగుల రక్షణపై చేపట్టవలసిన చర్యలపై భారత రైల్వే విభాగం, అటవీ శాఖ, వన్యప్రాణుల సంరక్షణ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 2011 నుంచి 2018 ఏప్రిల్ వరకు 7 ఏళ్లలో 22 ఏనుగులు దుర్మరణం చెందాయి.
2012–2013 మధ్య కేవుంజర్ జిల్లా పరిధి చంపువా అటవీ రేంజ్‌లో గల రైల్వే ట్రాక్‌పై రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 5 ఏనుగులు మృతిచెందాయి. ఇదేవిధంగా 2012 డిసెంబర్ 29వ తేదీ అర్ధరాత్రి గంజాం జిల్లా కళ్లికోట్ అటవీ రేంజ్ రంబా జంగిల్ పరిధిలో గల సుబలియా రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టడంతో 6 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో జరిగిన సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించి కేంద్ర వన్యప్రాణుల సంరక్షణ విభాగం, కేంద్ర అటవీ విభాగం అధికారులతో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ సభ్యులు ఏనుగులు మృతి చెందిన సంఘటన స్థలాలకు వచ్చి పరిశీలించి ప్రత్యేకంగా అరా తీసి కేంద్రానికి నివేదిక అందజేశారు.
మూణ్ణాళ్ల ముచ్చటగా రక్షణ చర్యలు
అనంతరం కేంద్రం ఆదేశంతో ఒడిశా రాష్ట్రం రైల్వే ట్రాక్ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల రక్షణ కోసం పలు విధాలా చర్యలు చేపట్టారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతంలో గల రైల్వేట్రాక్‌పై వెళ్లే రైళ్లు 20 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా నడపాలని కేంద్ర రైల్వే విభాగం అదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి అటవీ శాఖ, వన్యపాణ సంరక్షణ విభాగం, రైల్వే అధికారులు అప్రమత్తమై సాయంత్రం 6గంటల నుంచి (రాత్రంతా) ఉదయం 5గంటల వరకు రంబా సుబలియా రైల్వే లైన్ వచ్చేసరికి సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి పోయే ట్రైన్‌ల స్పీడ్ తగ్గించారు. ఇరువైపులా ట్రైన్‌లు 20 నుంచి 30 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే నడిచేవి. కొన్నాళ్ల తరువాత రక్షణ చర్యలు అటకెక్కాయి.
తాజాగా దుర్ఘటనలు
గత 2016–17 మధ్య ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో 7 ఏనుగులు మృతి చెందగా 2018 ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ఝార్సుగుడ జిల్లా బగ్గిధి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల రైల్వే ట్రాక్‌పై తాజాగా రైలు ఢీకొన్న దుర్ఘటనలో 4 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది
రాష్ట్రంలో రైల్వే ట్రాక్‌లపై ఏనుగుల దుర్మరణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టి ఏనుగులకు రక్షణ కల్పించాలి. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై తక్కువ వేగంతో రైళ్లు నడిపించాలి. ఇదే విధంగా అయా ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ వైర్లు అమర్చాలి. రైలు వచ్చిన సమయంలో ఈ సోలార్ విద్యుత్ వైబ్రేషన్ వచ్చేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ఉన్న రైల్వేట్రాక్ సైడ్‌లలో రైళ్లు స్లోగా నడపాలని సూచన బోర్డులు అమర్చాలి. ముఖ్యంగా ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో వన్యపాణి సంరక్షణ అధికారులు, అటవీశాఖ అధికారులు స్థానిక పోలీసులు సయుక్తంగా అయా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ జరపాలని జంతు ప్రేమికులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment