హుమాయూన్ సమాధి పునరుద్ధరణ ఓ కళాత్మక శ్రమ | Humayun's tomb is a renewal of artistic labor | Sakshi
Sakshi News home page

హుమాయూన్ సమాధి పునరుద్ధరణ ఓ కళాత్మక శ్రమ

Published Fri, Sep 20 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

Humayun's tomb is a renewal of artistic labor

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరం ఒక అద్భుత సౌందర్య నిలయం. మొఘల్ చక్రవర్తుల కాలం కళల నిలయంగా విలసిల్లింది. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలు వెలిసిన ఢిల్లీ వాస్తుశిల్పుల అధ్యయన కేంద్రం. ప్రపంచ వారసత్వ సంపదకు కేంద్రంగా ఉన్న ఢిల్లీలో అనేక కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ వాస్తు సంపదలో ఒకటిగా ప్రకటించిన 16వ శతాబ్దికి చెందిన మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సమాధి కూడా ఇదే స్థితికి చేరింది. ఐక్యరాజ్య సమితి వారసత్వ సంపదగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రసిద్ధ కట్టడానికి జీర్ణోద్ధరణ చర్యలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది.
 
 పాచీన కట్టడాల పునరుద్ధరణలో నిపుణులయిన అనేకమంది వాస్తు శిల్పులు ఆరేళ్లుగా శ్రమించి పునరుద్ధరణ చేశారు. హుమాయూన్ సమాధి ప్రాంగణంలో 21 వేల చదరపు మీటర్ల మేర సున్నపు ప్లాస్టర్ చేశారు. మరో 5,400 చదరపు మీటర్ల మేర ఇసుకరాయితో కూడిన నగిషీలు చెక్కించారు. 3,700 చదరపు మీటర్ల మేర శిథిలమైన గోపురాన్ని ప్రాచీన రీతిలోనే ఇసుకరాయితో తీర్చిదిద్దారు. అసమాన్య వాస్తు శిల్పకళకు నిలయమైన హుమాయున్ సమాధి నిపుణులైన శిల్పుల చేతిలో తిరిగి జీవకళ సంతరించుకుంది. బుధవారం ఈ కట్టడాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ జాతికి పునరంకితం చేశారు. 
 
 పునరుద్ధరణ ప్రాజెక్ట్‌కు సారథ్యం వహించిన రితీష్ నంద మాట్లాడుతూ ‘‘ఈ కట్టడం పునరుద్ధరణ ప్రక్రియ చాలా క్లిష్టమైంది. గోపురం నుంచి కారుతున్న నీటిని నిరోధించడం సవాలుగా నిలిచింది. నాడు ఈ కట్టడాన్ని నిర్మించిన శిల్పులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. అందుకే కట్టడంలో సన్నని పగుళ్ల ద్వారా నీరు చేరి కారడం మొదలయ్యింది. దీని కారణంగానే మొఘల్ చక్రవర్తి సమాధి శిథిలమయింది’’ అని వివరించారు. ‘‘పురాతన నిర్మాణానికి ఉన్న లక్షలాది కిలోల సిమెంట్, కాంక్రీట్‌ను తొలగించాల్సి వచ్చింది. పై కప్పు, నేల, ఉద్యానవన గవాక్షాలతో కలిపి మొత్తంగా వేల చదరపు మీటర్ల మేర పాత సున్నపు కాంక్రీట్‌ను తొలిగించి పగుళ్ల మధ్య సందుల్లో తిరిగి సున్నం నింపి నీరు కారకుండా చేశాం. ఈ సమాధి చక్రవర్తి మరణించిన తరువాత తొమ్మిదేళ్లకు 1565లో నిర్మితమైంది. మొఘల్ రాజవంశంలో రెండవ చక్రవర్తి సమాధిని యమునా తీరంలో నిర్మించారు. 1526లో బాబర్‌తో మొదలయిన మొఘల్ సామ్రాజ్యం 1857లో బ్రిటిష్ వలసపాలకుల మీద ప్రకటితమైన తొలి స్వాతంత్య్ర సమర సమయంలో బహుద్దూర్‌షా జాఫర్‌తో ముగిసింది’’ అని వివరించారు.
 
 హుమాయూన్ సమాధి పునరుద్ధరణకు ఆగాఖాన్ ట్రస్టు చొరవతీసుకుంది. 2007లో ప్రారంభమైన పునరుద్ధరణ ప్రక్రియలో తొలిదశలో ప్రాచీన నిర్మాణాన్ని అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను అంచనా వేశాం. పునరుద్ధరణ క్రమంలో ఈ నిర్మాణంలో ఉన్న పలకలను ప్రయోగం, పరిశీలన  పద్దతిని అనుసరించాము. ఇందుకు నాలుగు సంవత్సరాలు పట్టింది. ప్రత్యేక శిక్షణ అవసరమయింది. ఈ పనిలో ఉజ్బెకిస్థాన్‌లో శిక్షణ పొందిన యువ కళకారులు పాల్గొన్నారు. భారతదే శంలో ఇలాంటి పలకలను తయారు చేసే కళ అంతరించిపోయింది. సమీపంలోని హజ్రత్ నిజాముద్దీన్ బస్తీకి చెందిన యువకులకు ఈ పనిలో శిక్షణ ఇచ్చాము. దీని వలన వారికి ఉపాధి లభించిందని ఆయన వివరించారు.  
 
 ‘‘హుమాయూన్ సమాధి పునరుద్ధరణ చేపట్టిన తరువాత ఈ ప్రాంతంలో మౌలిక వనరులు మెరుగుపడ్డాయి. ఈ ప్రాజెక్ట్ కారణంగా నిర్మాణ నిపుణులకు 2 లక్షల పనిదినాల పనిదొరికింది’’ అని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. పున రుద్ధరణ ప్రక్రియలో భారత పురావస్తు శాఖ, సర్ దోరా బ్జీ టాటా ట్రస్టు, వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్, ఫోర్డ్ ఫౌండేషన్  తదితర సంస్థలు పాలుపంచుకొన్నాయి. ఈ సమాధితోపాటు పరిసరాల్లోని ప్రాచీన నిర్మాణాలు నీలా గుంబజ్, ఈషాఖాన్ ఉద్యానవన సమాధి, బూ అలీమా ఉద్యానవన సమాధి, అరబ్‌కీ సరాయ్ ద్వారాలు, సుందర్‌వాలా మహల్, బుర్జ్, చౌసత్ కంభా, హజ్రత్ నిజాముద్దీన్ బౌలీల పునరుద్ధరణ కూడా జరిగింది అని నందా వివరించారు. 
 
 హుమాయూన్ సమాధి పునరుద్ధరణను ప్రశంసించిన రాష్ట్రపతి
 న్యూఢిల్లీ: మొఘల్ వంశపు రెండవ చక్రవర్తి హుమాయూన్ సమాధి పునరుద్ధరణ పనులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. పునరుద్ధరణ పనులకు సారథ్యం వహించిన ఆగాఖాన్ ఫౌండేషన్ చైర్మన్ ఆగాఖాన్‌ను రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించిన ప్రణబ్‌ముఖర్జీ పునరుద్ధరణ పనులను ప్రశంసించారు. రాష్ట్రపతి భవన్ వెలువరిం చిన ఓ ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. చాందసవాదం, ఒంటెత్తుపోకడలకు వ్యతిరేకంగా హుమాయూన్ సమాధి పునరుద్ధరణ గొప్ప కృషి అని రాష్ట్రపతి ప్రశంసించినట్లు ఆ ప్రకటన వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని వివిధ విభాగాలతో కలిసి పనిచేస్తున్న ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ కృషి పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేసినట్లు ప్రకటన తెలిపింది. ప్రజారోగ్యం, గ్రామీణాభివృద్ధి, సాంస్కృతిక రంగాల్లో ఫౌండేషన్ కృషి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement