మువ్వెన్నెల రెపరెపలు
Published Mon, Jan 27 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
సాక్షి, న్యూఢిల్లీ:నగరం ఆదివారం త్రివర్ణశోభితంగా మారింది. ప్రతి పౌరుడి గుండెలు దేశభక్తితో ఉప్పొంగాయి. మన సైనికుల కవాతు, దేశ అస్త్రసంపత్తిని కళ్లారా చూసేందుకు వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఢిల్లీవాసులు తెల్లవారుజాము నుంచే రాజ్‌పథ్‌వైపు బారులు తీరారు. పరేడ్ ఆద్యంతం కేరింతలు కొడుతూ సంబరపడ్డారు. 65వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లతో రాజధాని నగరంలో సందడి నెలకొంది. పలు కార్యాలయాలు, సంస్థల్లో జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు జరుపుకున్నారు. గట్టి బందోబస్తు మధ్య గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా 55 వేల మంది సిబ్బంది డేగకళ్లతో పహారా కాశారు. రాజధానిలోని అన్ని ప్రాంతాల్లో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రైల్వే, మెట్రోస్టేషన్లు, బస్టాపులు, ప్రముఖ మార్కెట్లలోనూ సాయుధ బలగాలు కనిపించాయి. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచి సెంట్రల్‌ఢిల్లీ ప్రాంతాన్ని పోలీసు సిబ్బంది అష్టదిగ్భంధనం చేశారు.
చిన్న అనుమానం కలిగినా క్షుణ్ణంగా పరిశీలించారు. శనివారం రాత్రి వణికించే చలిలోనూ ఢిల్లీ పోలీసులతోపాటు సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌తోపాటు ఇతర బలగాలు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాయి. ఢిల్లీలోనికి ప్రవేశించే, బయటికి వెళ్లే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. గణతంత్ర వేడుకలను చూసేందుకు వచ్చే వారితో రాజ్‌పథ్ పరిసరాలు సందడిగా మారాయి. దేశభక్తిని చాటుతూ యువత మువ్వన్నెల రంగులను ముఖంపై పూసుకుని వినూత్నంగా కనిపించింది. జాతీయ జెండాలను చేతపట్టుకుని బైక్‌లపై తిరుగుతూ ‘జై హింద్’ నినాదాలు చేశారు. పరేడ్ అనంతరం రాజ్‌పథ్ రోడ్డులో నిబంధనలు సడలించడంతో అంతా ఫొటోలకు పోజులిచ్చారు. ఇండియాగేట్ పరిసరాల్లో త్రివర్ణ పతాకాల మధ్య ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ‘పరేడ్ చూడడం చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఎప్పటికీ మరిచిపోలేను. కవాతును కళ్లారా చూడడం గర్వంగా అనిపించింది’ అని ఢిల్లీకి వచ్చిన కృష్ణారావు అనే తెలుగు యువకుడు పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి పరేడ్‌ను చూసినట్టు తెలిపారు.
విశేషాలు
వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వశాఖల శకటాలు వినోదం, విజ్ఞానం పంచాయి
ఉదయం 6.30 గంటలకే ప్రజలు వేదిక వద్దకు చేరుకున్నారు
వాయుసేన విమానాలు, బీఎస్‌ఎఫ్ మోటారు సైకిళ్ల విన్యాసాలు అబ్బురపర్చాయి
జవాన్లు ప్రదర్శించిన ఏరోబిక్ విన్యాసాలు, మానవ పిరమిడ్లు కూడా అలరించాయి
స్థానిక విద్యార్థులూ వేడుకలకు హాజరయ్యారు
Advertisement
Advertisement