అసెంబ్లీలో దుమారం
చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై విమర్శలతో రెవెన్యూ మంత్రి ఉదయకుమార్ మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో దుమారం లేపారు. తమ పార్టీ అధినేతపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహించిన డీఎంకే సభ్యులు చివరకు సస్పెండ్‌కు గురయ్యారు. 2014-15 వార్షిక బడ్జెట్‌పై చర్చించేందుకు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారంతో ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది.
లాజర్ (సీపీఎం), గుణశేఖర్ (సీపీఐ), వేలు (డీఎంకే), జవహరుల్లా (మనిదనేయ మక్కల్ కట్చి), సెంథిల్‌కుమార్ (డీఎండీకే), రంగరాజన్ (కాంగ్రెస్) తదితర సభ్యులు రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఏకరువుపెట్టారు. ప్రతిపక్షాల విమర్శలకు రెవెన్యూమంత్రి ఉదయకుమార్ మధ్యలో అడ్డుతగులుతూ, కరువు, కాటకాలు, వరదలు, సునామీలను సునాయాసంగా అధిగమించే నేర్పు, తల్లివంటి మనసు కలిగిన ముఖ్యమంత్రి జయలలితకు ఉందని అన్నారు. సునామీ సహాయక చర్యలతో ప్రపంచ దేశాల నుంచి ఆమె ప్రశంసలు అందుకున్నారని పేర్కొన్నారు. సునామీ సంభవించినపుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చేతులెత్తేసి రహస్య ప్రదేశంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి వ్యాఖ్యలతో ఆగ్రహించిన డీఎంకే సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు.
మంత్రి విమర్శలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుపట్టారు. సభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ పదే పదే ఆదేశించారు. దీంతో డీఎంకే సభ్యులు మరింత ముందుకు వచ్చి స్పీకర్‌ను ముట్టడించినంత పనిచేశారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, అధికార పక్ష సభ్యులు ప్రతినినాదాలు చేశారు. సభ్యులంతా ఒకరిపై ఒకరు చేతులు ఊపుకుంటూ వాగ్యుద్ధానికి దిగారు. దీంతో స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ ప్రవేశించి డీఎంకే సభ్యులందరినీ బలవంతంగా వెలుపలకు పంపేశారు. డీఎంకే సభ్యులపై ఇప్పటికే మూడుసార్లు మార్షల్స్ ప్రయోగం చేయాల్సి వచ్చిందని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి వారిని మళ్లీ అనుమతించానని స్పీకర్ చెప్పారు.
అయినా వారి ఆగడాలు మితిమీరిపోవడం వల్ల బడ్జెట్ సమావేశాల ప్రయోజనాన్ని కాపాడేందుకు డీఎంకే సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ఈ ప్రకటనకు నిరసన తెలుపుతూ సభలోని మిగిలిన ప్రతిపక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. ఇదే సమయంలో మంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి ఉదయకుమార్ చెబుతున్నమాటలను వారు పట్టించుకోలేదని, స్పీకర్ నచ్చజెప్పినా వినిపించుకోనందుకు ప్రతిఫలంగా సస్పెండ్ తప్పలేదని చెప్పారు. ఆగ స్టు 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బుధవారం నుంచి డీఎంకే సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కానున్నారు.