- మైసూరు కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలింపు
- కోలుకుంటున్న సుజా కుశాలప్ప
- ఎదురు కాల్పులు జరిపిన కుమారుడు
- దుండగుల కోసం ప్రత్యేక బృందాలు
బెంగళూరు, న్యూస్‌లైన్ : రాజకీయ వైరం కారణంగా కొడగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై దుండగులు రివాల్వర్‌తో కాల్పులు జరిపిన సంఘటన వీరాజపేటలో గురువారం జరిగింది. క్షతగాత్రుడు సుజా కుశాలప్ప గొంతు, మరో రెండుచోట్ల బుల్లెట్లు దూసుకెళ్లాయి. వీరాజపేటలో ప్రథమ చికిత్స అనంతరం ఆయన్ను మైసూరుకు తరలించారు.
కొడగు జిల్లా కేంద్రంలోని మడికెరీలో అఖిల భారత సాహిత్య సమ్మేళనం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఆ కార్యక్రమంపై దృష్టి సారించింది. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థులు రెచ్చిపోయారు. రాజకీయవైరంతో కాల్పులు జరిపిన సంఘటన జిల్లాలో ఇదే ప్రథమం. కొడగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సుజా కుశాలప్ప స్వయానా మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే (మడికేరి) అప్పచ్చు రంజన్ సోదరుడు. గురువారం సాయంత్రం సుజా కుశాలప్ప తన కుమారుడు శశాంక్ తదితరులతో వీరాజపేటలోని తన కార్యాలయంలో ఉన్నాడు.
అదే సమయంలో కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు క్షణాల్లో కాల్పులు జరిపి పరారయ్యారు. దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో కుశాలప్ప శరీరంలో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. కుమారుడు శశాంక్ తేరుకుని కారులో పరారవుతున్న దుండగులపై ఎదురు కాల్పులు జరిపా డు. సహచరులు కుశాలప్పను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అన ంతరం మైసూరుకు తరలించారు.
రాజకీయవైరంతోనే కుశాలప్ప పై హత్యాయత్నం జరిగిందని, మాజీ స్పీకర్, వీరాజపేట ఎమ్మెల్యే కే.జీ. బోప్పయ్య ఆరోపించారు. దుండగులు తనపై కూడా కాల్పులు జరపడానికి యత్నించారని శశాంక్ తెలిపాడు. పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలుసేకరించారు. రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆత్మరక్షణ కోసం శశాంక్ కాల్పులు జరిపినట్లు కొడగు ఎస్‌పీ అనుజిత్ మీడియాకు వివరించారు.