‘కుంభకోణం’ ఘటనలో పదిమందికి జైలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అది తంజావూరు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు.... బుధవారం ఉదయం 8 గంటలు.... సహజంగా న్యాయవాదులు, కక్షిదారులతో ఉండే కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఎక్కడ చూసినా కుటుంబాలు. విద్యార్థులు. విషణ్ణ వదనాలతో కొందరు, వారిని ఊరడిస్తూ మరికొందరు. కోర్టు పరిసరాలను డేగకన్నుతో గమనిస్తూ వందలాది మంది పోలీసులు. ఎప్పుడెప్పుడు కోర్టు ప్రారంభవుతుందా అనే ఆతృత, ఎటువంటి తీర్పు వస్తుందోననే ఉత్కంఠ. సమయం 10.30 గంటలు దాటింది. న్యాయమూర్తి మహ్మమద్ అలీ ఆశీనుల య్యూరు. చిన్నారుల సజీవ దహనానికి, ఎందరో తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమైన పదిమందికి జైలు శిక్ష విధిం చారు. చిన్నపాటి ఆర్థిక సహాయంతో వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు.
మరో 11 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. తంజావూరు జిల్లా కుంభకోణం కాశీరామన్ వీధిలో శ్రీ కృష్ణ ప్రాథమిక పాఠశాల, సరస్వతీ పాఠశాల, శ్రీకృష్ణ మహిళా ఉన్నత పాఠశాలలో 2004 జూలై 16వ తేదీ జరిగిన ప్రమాదంపై పదేళ్ల సుదీర్ఘవిచారణ తరువాత తీర్పు వెలువరించారు. ఆ రోజు ఉదయం 200 మంది విద్యార్థులతో పాఠశాల తరగతులు ప్రారంభమయ్యూయి. మధ్యాహ్నం భోజనం వండేందుకు పాఠశాల ప్రాంగణంలోనే ఉన్న వంటశాల నుంచి మంటలు చెలరే గారుు. 94 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యూరు. మరో18 మంది కాలిన గాయాలతో బయటపడ్డారు. అప్పట్లో ఈ ప్రమాదం దేశంలోనే కలకలం రేపింది.
రాష్ట్రంలో అతిపెద్ద ప్రమాదంగా నమోదైంది. పాఠశాల కరస్పాండెంట్ పళనిస్వామి, ఆయన భార్య, కరస్పాండెంట్ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు శాంతలక్ష్మి తదితరులతోపాటూ విద్యాశాఖకు చెందిన పలు అధికారులను కలుపుకుని మొత్తం 24 మందిపై పది సెక్షన్ల కింద కుంభకోణం పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగినపుడు అందరినీ అరెస్ట్ చేయగా బెయిల్‌పై వచ్చారు. ఈ కేసుకు సంబంధించి 2005లో కుంభకోణం కోర్టులో చార్జిషీటు దాఖలైంది. నిందితులకు 2006లో చార్జిషీటు ప్రతులను అందజేశారు. నిందితుల్లో పాఠశాల కరస్పాండెంట్ పళనిస్వామి అల్లుడు, పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు ప్రభాకరన్ అప్రూవర్లుగా మారారు.
విద్యాశాఖ డెరైక్టర్ కన్నన్, సీఈవో ముత్తుపళనిస్వామి, తహశీల్దారు పరమశివంను హైకోర్టు విడిచిపెట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు 512 మంది సాక్షులను విచారించారు. ఈనెల 31వ తేదీలోగా కేసు విచారణను పూర్తిచేసి తీర్పు చెప్పాలని ఈ ఏడాది మే 5వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు తంజావూరు జిల్లా మొదటిశ్రేణి మేజిస్ట్రేటు మహ్మమద్ ఆలీ తుది తీర్పు చెప్పే ముందు నిందితులను విచారించారు. చార్జిషీటులోని 21 మందిలో 11 మందిని నిర్దోషులుగా ఆయన ప్రకటించారు. పాఠశాల నిర్వహణలో సర్వం తానై అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పాఠశాల యజమాని పళనిస్వామిని కోర్టు ప్రధానంగా తప్పుపట్టింది. పళని స్వామికి యావజ్జీవ శిక్షను విధిస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. అంతేగాక మృతి చెందిన 94 మంది విద్యార్థుల తరపున ఒక్కో విద్యార్థికి పదేళ్ల చొప్పున అంటే 940 ఏళ్ల శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇది సాధ్యం కాదు కాబట్టి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఏకకాలంలో అనుభవించాలని చెప్పారు. రూ.52.57 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. పరిహారం సొమ్మును మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొరికి రూ.25 వేలు, గాయపడినవారికి రూ.15 వేలు చొప్పున చెల్లించాలని ఆదేశించారు. పాఠశాల యజమాని పళనిస్వామి భార్య, పాఠశాల కరస్పాండెంట్ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు శాంతలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు విజయలక్ష్మి, వంటమనిషి వసంతి, ఎలిమెంటరీ ఆఫీసర్ బాలాజీ, అసిస్టెంట్ ఎలిమెంటరీ ఆఫీసర్ శివప్రకాష్, పీఏ దురైరాజ్, రాష్ట్ర ఎలిమెంటరీ ఆఫీసర్ తాండవన్‌లకు తలా ఐదేళ్లు, ఇంజనీరు జయచంద్రన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు.
నిర్దోషులు
జిల్లా ఎలిమెంటరీ పాఠశాల విద్యాశాఖాధికారి బీ పళనిస్వామి, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ నారాయణస్వామి, అసిస్టెంట్ ఎలిమెంటరీ పాఠశాల విద్యాశాఖాధికారులు ఎస్ రాధాకృష్ణన్ , కే బాలకృష్ణన్, మాధవన్, వీ బాలసుబ్రమణ్యన్, ఉపాధ్యాయులు పీ దేవీ, మహాలక్ష్మి, టీ అంతోని, కుంభకోణం మునిసిపల్ కమిషనర్, కుంభకోణం మునిసిపాలిటీ టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ కే మురుగన్ ఈ 11 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. ఆనాటి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు సైతం కోర్టు ప్రాంగణానికి చేరుకోవడం విశేషం.
తీర్పు నిరసనలు
కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. 11మందిని నిర్దోషులుగా విడుదల చేయడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కోర్టు తీర్పుపై అప్పీలు చేయనున్నట్లు బాధిత తల్లిదండ్రులు ప్రకటించారు. అలాగే ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు మద్రాసు హైకోర్టు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.