ప్రేమే తొక్కేసింది
రెండక్షరాల ప్రేమ చాలా శక్తి కలది. అది మనిషి జీవితాన్ని ఆకాశానికి ఎత్తేయగలదు, పాతాళానికి తొక్కేయగలదు. నటి ఆర్తి అగర్వాల్ జీవితం రెండో కోవకు చెందినది. తమిళంలో బంపర కన్నాలే చిత్రం ద్వారా పరిచయమైన ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగులో ప్రముఖ హీరోలందరి సరసన నటించి టాప్‌నాయకిగా వెలుగొందారు. అలాంటి ఆర్తి ప్రేమలో పడి అందులో పరాజయం పాలై చివరికి ఆత్మహత్యకు యత్నించారు.
ఆ దుర్ఘటన తరువాత అవకాశాలిచ్చే వారే లేకపోయే. ఆర్తి మాట్లాడుతూ, ప్రేమలో పడి పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలని కథానాయికగా లైమ్‌లైట్‌లో వున్న తాను మంచి అవకాశాలను దూరం చేసుకున్నానని తెలిపారు. అయితే తన జీవితంలో ఆశించిందేదీ సరిగా జరగలేదన్నారు. ప్రేమ కారణంగా చాలా నష్టపోయానని పేర్కొన్నారు. ఒకప్పుడు కోరి వచ్చిన అవకాశాలను తిరస్కరించిన తాను ఇప్పుడు నటిద్దామన్నా అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళం, తెలుగు ఏ భాషలోనైనా మంచి అవకాశం వస్తే నటించడానికి సిద్ధం అన్నట్లు ఆర్తి అగర్వాల్ పేర్కొన్నారు.