ప్రభుత్వ ఉద్యోగమిస్తామని ఎక్కడా చెప్పలేదు
ఇంటికో ఉద్యోగం హామీపై నారా లోకేశ్ భాష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: గత ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీపై సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన భాష్యం చెప్పారు. ఇంటికో ఉద్యోగమిస్తామని తమ పార్టీ చెప్పింది తప్ప అది ప్రభుత్వ ఉద్యోగమని ఎక్కడా చెప్పలేదని బుకాయించారు. ఇంటికో ఉద్యోగం అంటే అది ప్రైవేటు ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలైనా అందులోకే వస్తాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసినప్పుడు అవి కూడా ఈ లెక్కలోకే వస్తాయన్నారు.
శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నన్నయ్య యూనివర్సిటీ, వికాస, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాను లోకేశ్ ప్రారంభించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తాము రాష్ట్రాన్ని పాలించేందుకు ఐదేళ్లకు ఓట్లు వేశారని, తాము ఎక్కడికీ పారిపోవట్లేదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పామన్న లోకేశ్ నిరుద్యోగులను ఆదుకుంటామ న్నారు. రెండేళ్లలో చంద్రబాబు వేసిన పునాది వల్ల దాదాపు లక్ష ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.