పాద పూజ వద్దు!
► గంభీర నమస్కారంచాలు
► కేడర్‌కు స్టాలిన్ వేడుకోలు
సాక్షి, చెన్నై: పాదపూజ, సాష్టాంగ నమస్కారం, ఒంగి.. ఒంగి.. దండాలు..పెట్టే సంస్కృతిని ఇకనైనా వీడి, గంభీర నమస్కారంతో నేతల్ని ఆహ్వానిస్తే చాలు అని కేడర్‌కు డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కార్యకర్తలకు, నాయకులకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో రాజకీయ పక్షాల అధినేతలకు పాదపూజ చేయడం, సాష్టాంగ న మస్కారాలు చేయడం, ఒంగి..ఒంగి దండాలు పెట్టడం వంటి సంస్కృతి ఆది నుంచి వస్తున్న విషయం తెలిసిం దే. అధినేతల దృష్టిలో పడేందుకు అనేక మంది అత్యుత్సాహం ప్రదర్శించడం ఎక్కువే. ఈ సంస్కృతి అన్నాడీఎంకేలో ఇన్నాళ్లు మరీ ఎక్కువేనని చెప్పవచ్చు.
ఇది కాస్త విమర్శలకు దారి తీసింది. తాజాగా, ఈ సంస్కృతి మళ్లీ ఆ పార్టీలో తెర మీదకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. చిన్నమ్మ శశికళ మెప్పునకు నేతలు అత్యుత్సాహం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.ఈ పరిస్థితుల్లో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన స్టాలిన్ కొందరు కార్యకర్తల రూపంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అభిమానంతో ఆ కార్యకర్తలు తన వద్దకు వచ్చే సమయంలో ఆశీర్వదించాలంటూ కాళ్ల మీద పడుతుండడంతో మేల్కొన్నారు. ఆ సంస్కృతికి డీఎంకేలో చరమ గీతం పాడే విధంగా కేడర్‌కు లేఖాస్త్రం సంధించారు.
పాదపూజ వద్దు: సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా తమిళనాడు బాసిళ్లుతున్నట్టు తన లేఖలో గుర్తు చేశారు. అధినేత కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ అతి పెద్ద బాధ్యతల్ని తనకు అప్పగించారని పేర్కొన్నారు. ఆ బాధ్యతల్ని నెరవేర్చడం లక్ష్యంగా ప్రతి ఒక్కర్నీ కలుపుకుని ముందుకు సాగుతానన్నారు. తాను బాధ్యతలు స్వీకరించినానంతరం పెద్ద సంఖ్యలో కేడర్ శుభాకాంక్షల పేరుతో ప్రేమానురాగాలతో అభినందనలు తెలియజేయడానికి వస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే వాళ్లల్లో పలువురు హఠాత్తుగా వ్యవహరిస్తున్న తీరు, మనస్సును ద్రవింపచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తప్పా, మరెవ్వరి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం కేడర్‌కు లేదని సూచించారు. మనిషికి మనిషి గౌరవం ఇవ్వాలని, అయితే, కాళ్ల మీద పడడం వంటి సంస్కృతిని ఇక నైనా వీడాలని విన్నవించారు. కొన్ని చోట్ల సాగుతున్న ఈ సంస్కృతి రాష్ట్రానికి తలవంపులు తెచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇక మీదట ఏ కార్యకర్తలు పాద పూజగానీ, సాష్టాంగ నమస్కారాలు మాత్రం దయ చేసి చేయ వద్దని వేడుకున్నారు.
నో కామెంట్స్ : డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్ నియామకంపై ఆయన సోదరుడు, ఆ పార్టీ బహిష్కృత నేత ఎంకే అళగిరిని ప్రశ్నించగా నో కామెంట్స్ అని ముందుకు సాగారు. స్టాలిన్, అళగిరిల మధ్య వారసత్వ సమరం సాగిన విషయం తెలిసిందే. శనివారం గోపాలపురంలో అధినేత, తండ్రి కరుణానిధితో అళగిరి భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్యం సమాచారం తెలుసుకున్నారు. అళగిరిని మీడియా కదిలించగా నో కామెంట్స్ అంటూ ముందుకు సాగడం విశేషం. ఇక, చేట్‌పట్ ఎంసీసీ స్కూల్‌లో జరిగిన పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమంలో అళగిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.