ఎగ్మూరు కోర్టులో మళ్లీ కలకలం | Non-practising Advocates Blamed for Murder in Court | Sakshi
Sakshi News home page

ఎగ్మూరు కోర్టులో మళ్లీ కలకలం

Published Tue, Feb 3 2015 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

ఎగ్మూరు కోర్టులో మళ్లీ కలకలం

ఎగ్మూరు కోర్టులో మళ్లీ కలకలం

చెన్నై, సాక్షి ప్రతినిధి:చెన్నై ఎగ్మూరు కోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు న్యాయవాది హత్యకు దారితీసిన పరిస్థితులు సద్దుమణిగేలోగా సోమవారం మళ్లీ కలకలం రేగింది. కోర్టు పనుల నిమిత్తం వచ్చిన ఇద్దరు మహిళల మధ్య ఏర్పడిన ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో గెలుపొందిన ప్యానెల్‌కు చెందిన స్టాలిన్ అనే న్యాయవాది శనివారం దారుణహత్యకు గురైన తరువాత కోర్టు ప్రాంగణం నివురుగప్పిన నిప్పులా మారిం ది. ఎన్నికలు ముగిసిన తరువాత సోమవారం తొలి పనిది నం కావడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకేసులో మహిళా న్యాయవాది కూడా అరెస్ట్ కావడంతో మహిళా కానిస్టేబుళ్లను కూడా బందోబస్తుకు నియమించారు. ఇదిలా ఉండగా, మనాలికి చెందిన తమీమ్ (44) అనే మహిళ ఒక కేసు నిమిత్తం సోమవారం ఉదయం ఎగ్మూరు కోర్టుకు వచ్చింది. అదే సమయంలో సుమిత్ర (36) అనే మహిళా మరో కేసులో జామీను కోసం కోర్టుకు హాజరయింది.
 
 సుమిత్రాను చూడగానే తమీమ్ ఆమెతోపాటూ వచ్చిన మరో పదిమంది చుట్టుముట్టారు. ఆమెను గట్టిగా పట్టుకుని తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. దీంతో కోర్టు పరిసరాల్లో కలకలం రేగడంతో బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు వారిని విడదీశారు. ఈ ఘర్షణపై తమీమ్ మీడియాతో మాట్లాడుతూ, న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని సదరు సుమిత్ర 24 మంది నుంచి తలా రూ.1.80 లక్షలు తీసుకుందని, కమిషన్ ఇస్తానని చెప్పడంతో తాను కూడా కొందరి నుంచి వసూలు చేసి డబ్బులు కట్టానని చెప్పింది. అయితే 20 మందిని కెనడాకు పంపగా అక్కడ వారెవ్వరికీ తగిన ఉద్యోగాలు దొరకలేదని తెలిపింది. దీంతో కెనడాకు వెళ్లినవారందరినీ తన సొంత ఖర్చుతో భారత్‌కు రప్పించానన్నారు. తన వారిద్వారా కట్టిన సొమ్మును తిరిగి ఇవ్వలేదని తమీమ్ పేర్కొంది. సుమిత్ర సోమవారం కోర్టుకు వస్తున్నట్లు తెలిసి ఆమె వల్ల నష్టపోయిన వారిని వెంటబెట్టుకుని వచ్చానని, అయితే సొమ్మురాబట్టుకునే ప్రయత్నంలో పోలీసులు అడ్డుపడ్డారని ఆరోపించింది.
 
 న్యాయవాదుల విధుల బహిష్కరణ
 బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపొందిన ప్యానల్‌కు చెందిన న్యాయవాది స్టాలిన్ హత్యతో కోర్టు ప్రాంగణం నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేయగా, మరో 30 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యోదంతంతో ఉద్రిక్తతల నడుమ శనివారం బార్ కౌన్సిల్ ఎన్నికలు ముగిసిన తరువాత సోమవారం యథావిధిగా కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యూయి. అయితే అధిక సంఖ్యాక న్యాయవాదులు హతుడు స్టాలిన్‌కు శ్రద్ధాంజలి సూచకంగా తమ విధులను బహిష్కరించారు. న్యాయవాది ఇళంగోవన్ మాట్లాడుతూ, బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని తెలిసినా పోలీసులు తగిన బందోబస్తు చేయని ఫలితంగా దారుణ హత్యకు దారితీసిందన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల ముసుగులో ఎంతోమంది క్రిమినల్స్ కోర్టు ప్రాంగణంలో సంచరిస్తున్నారని ఆరోపించారు. పూటుగా మద్యం తాగి, కోర్టు ప్రాంగణంలోనే మారణాయుధాలతో సంచరిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలని కోరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement