టీఎన్‌సీసీకి కొత్త కార్యవర్గం
Published Tue, Aug 20 2013 6:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యవర్గం జాబితా సిద్ధమైంది. ఇది మరో మూడు రోజుల్లో వెలువడుతుందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ ప్రకటించారు.
సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కార్యవర్గం నియమించి పన్నెండేళ్లు అవుతోంది. ఎందరు అధ్యక్షులు వచ్చినా కార్యవర్గం ఏర్పాటుపై ఏ ఒక్కరూ దృష్టి పెట్టలేదు. దీంతో పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. కార్యవర్గం నియూమకంపై దృష్టి పెట్టాలంటూ ఏఐసీసీకి పదేపదే విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ క్రమంలో కేంద్ర నౌకాయూనశాఖ మంత్రి జీకేవాసన్ మద్దతుదారుడు జ్ఞానదేశికన్ టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త కార్యవర్గం ఏర్పాటుపై ఆయన దృష్టి సారించారు. జ్ఞానదేశికన్ సిద్ధం చేసిన జాబితాలను పలుమార్లు పక్కన పెట్టారు. పార్టీలోని గ్రూపు రాజకీయాల పుణ్యమా అని ఆ జాబితాల్లో మార్చులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అయితే కార్యవర్గం ప్రకటన మాత్రం వెలువడలేదు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ముకుల్ వాస్నిక్ బాధ్యతలు చేపట్టడంతో కార్యవర్గం ఏర్పాటుపై ఒత్తిడి పెరిగింది. దీంతో వాస్నిక్ చకచకా పావులు కదిపారు. కొత్త జాబితాను సిద్ధం చేసి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌కు సమర్పించారు. ఈ జాబితా పది రోజుల క్రితం వెలువడుతుందని అందరూ భావించా రు. అయితే కొన్ని గ్రూపుల నేతలు మోకాలొడ్డడంతో వాయిదా పడింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులనూ అధిగమించి కొత్త జాబితాను ముకుల్ వాస్నిక్ సిద్ధం చేశా రు. రాహుల్ ఆమోదం పొందిన ఈ జాబితా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతకం కోసం ఎదురు చూస్తోంది.
మూడు రోజుల్లో..
టీఎన్‌సీసీ కార్యవర్గం జాబితా మరో మూడు రోజుల్లో వెలువడుతుందని జ్ఞానదేశికన్ ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు దీరర్ సత్యమూర్తి, కాంగ్రెస్ సీనియర్ నేత జీకే మూపనార్ జయంతి వేడుకలు సత్యమూర్తి భవన్‌లో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞానదేశికన్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గం కమిటీ ఎంపిక ప్రక్రియ ముగిసిందని, మూడు రోజుల్లో జాబితా వెలువడుతుందని ప్రకటిం చారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారందరికీ పదవులు దక్కబోతున్నాయని పేర్కొన్నారు.
Advertisement