- 'సత్రం’ భూముల టెండర్లు రద్దు చేయాలి
- తమిళనాడు తెలుగు బ్రాహ్మణ మహాసభ నిలదీత
చెన్నై: అమరావతి సదావర్తి సత్రానికి చెందిన దేవుడి సొమ్మును అప్పనంగా బొక్కేసేలా నిర్వహించిన టెండర్లపై తమిళనాడులో అగ్రహం పెల్లుకుబుతోంది. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ‘అమరవాతి సదావర్తి సత్రంలో వెయ్యికోట్ల లూటీ’ పేరుతో ఈనెల 28వ తేదీన సాక్షిలో వచ్చిన కథనం చదివిన తమిళనాడులోని తెలుగువారు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 28న తూతూ మంత్రంగా టెండర్ల స్వీకరణ, వేలంపాట నిర్వహించి మమ అనిపించారు. 70 ఏళ్ల క్రితం దాత ఇచ్చిన 471 ఎకరాల్లో కేవలం 83.11 ఎకరాలను మాత్రమే గుర్తించడం సాధ్యమైందని నమ్మబలికిన ఏపీ ఎండోమెంటువారు ముందుగానే నిర్ణయించుకున్న వ్యక్తులకు నామమాత్రపు ధరకు అప్పగించారు.
టెండర్ల స్వీకరణ, వేలం పాట వ్యవహారమంతా ఒక డ్రామాలా సాగిందని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మొత్తం నలుగురు వ్యక్తులు వేలం పాటలో పాల్గొనగా, ఇద్దరు చెల్లించిన ధరావత్తు సొమ్మును పాట గెలుచుకున్న మూడో వ్యక్తి పేరున అధికారులు జమ చేసుకోవడమే వేలం ముసుగులో సాగిన లూటీకి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. పైగా పాట ముగిసిన తరువాత 50 శాతం సొమ్మును అక్కడికక్కడే చెల్లించాలనే నిబంధనను తుంగలో తొక్కి రూ.11 కోట్లకు గానూ రూ.30 లక్షలతో సరిపెట్టుకున్నారని ఆయన చెప్పారు.
చెన్నై నగరంలోని బడా బడా రియల్టర్లు, బిల్డర్ల దృష్టికి వెళ్లకుండా వేలం పాటలను గోప్యంగా నిర్వహించడంలోనే ఏపీ ప్రభుత్వ అవినీతి బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నై శివార్లలోని సత్రం భూములు ఖాళీగా దర్శనమిస్తున్నా వాటిని గుర్తించడం సాధ్యం కాలేదని ఏపీ అధికారులు చెప్పడం విచిత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతపెద్ద కుంభకోణం కేవలం కిందిస్థాయిలో జరిగే వ్యవహారం కాదని, ఏపీ ప్రభుత్వంలోని అగ్రజుల అండదండలతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. గత వేలం పాటలను రద్దుచేసి మరింత పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని తమిళనాడుకు చెందిన తెలుగు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.