మార్పు కావాలి.. మీరు రావాలి
తమిళసినిమా: ప్రజలకు మార్పు కావాలి. మీరు రావాలి. ఏంటీ సీన్ అర్థం అయిపోయిందా? అవును మన సూపర్‌స్టార్ అభిమానుల చిరకాల ఆకాంక్ష ఇదే. అలా జరగాలని వారు కంటున్న కల ఇదే. రజనీకాంత్ ఎస్ అన్న ఒకే ఒక్క మాటకు ప్రస్తుత తమిళనాడు రాజకీయ చరిత్రను ఒక్కసారిగా మార్చివేసే శక్తి ఉంది. ఇది చాలా కాలం క్రితమే రుజువైంది. ఆ తరువాత కూడా ఆ దేవుడు శాసిస్తే ఈ రజనీకాంత్ పాటిస్తాడు అన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం కలిగించాయి.
దీంతో పలు రాజకీయ పార్టీలు ఆయన మద్దతు కోసం అర్రులుచాశాయి, చాస్తున్నాయి కూడా. ఇటీవల కూడా బీజేపీ పార్టీ ఆర్కేనగర్ ఉప ఎన్నిల్లో రజనీకాంత్ మద్దతు ఆశించింది. అయితే రజనీకాంత్ ఏ పార్టీకీ మద్దతు తెలుపకుండా మౌనంగానే ప్రస్తుత రాజకీయ పరిణామాలను క్షుణంగా గమనిస్తున్నారు. అంతే కాదు తన అభిమానులతో కలయిక అంటూ అప్పుడప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక జర్క్ ఇస్తున్నారు.
అయితే ఆయన అభిమానులు మాత్రం తలైవా మీరు రాజకీయాల్లోకి వచ్చే తీరాలి అంటూ తమ మనోవాంచను తరచూ పలు విధాల చర్యలతో రజనీ దృష్టికి తీసుకొసూ్తనే ఉన్నారు. తాజాగా పలు సమస్యలను ప్రస్తావిస్తూ ఇంద నిలై మారవేండుం..మక్కళ్‌కు మాట్రం వేండుం..నీంగ సీఎం ఆగవేండుం(ప్రస్తుత పరిస్థితి మారాలి..ప్రజలకు మార్పు కావాలి..మీరు సీఎం కావాలి) అన్న నినాదాలతో చెన్నై నగరం అంతా భారీ పోస్టర్లు వెలశాయి. ఆ పోస్టర్లలో రజనీకాంత్ ఠీవీగా కుర్చీలో కూర్చుని చిరుదరహాసం చేస్తున్న ఫొటో దర్శనమిస్తోంది.