తెలంగాణలో ఏర్పాటయ్యే తొలి ప్రభుత్వం తక్షణ అభివృద్ధి పనులపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ప్రధాన ప్రభుత్వ శాఖల్లో నూతన ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించింది. విద్య, వైద్యం, సాగు, తాగునీటి రంగాలు, వ్యవసాయం, గృహ నిర్మాణం తదితర ప్రధానశాఖల్లో ప్రస్తుత పరిస్థితి, దిద్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదిక ప్రస్తావించింది. ఆయా విభాగాల వారీగా రూపొందించిన అధికారులు నివేదికను ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ రూపంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్
గిరిజాశంకర్ అందజేశారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్‌కు నివేదించారు. అందులోని అంశాలు ఇలా..రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లాగా నమోదైంది. అక్షరాస్యత 56.05శాతం కాగా, పురుషుల్లో 66.25, మహిళల్లో 45.65శాతంగా ఉంది. 15కు పైగా మండలాల్లో అక్షరాస్యత శాతం 50కంటే తక్కువగా ఉంది. 15ఏళ్లకు పైబడిన వారిలో ఏడు లక్షలకు పైగా నిరక్షరాస్యులు ఉన్నారు. రాష్ట్రంలోనే గట్టు మండలంలో అత్యల్పంగా 34.45శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు.
జిల్లాలో సాధారణ సాగువిస్తీర్ణం 7.25లక్షల హెక్టార్లు కాగా 2.5లక్షల హెక్టార్లకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉంది. వరి, జొన్న, మొక్కజొన్న వంటి పంటలు నాలుగు లక్షల హెక్టార్లు, పెసలు, కందులు, మినుములు వంటి పప్పుధాన్యాలు 1.5లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నాయి. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాగునీటి సౌకర్యం, ఎరువులు, విత్తనాల కొరత, వ్యవసాయ సిబ్బంది ఖాళీలు వంటివి వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్నాయి.
జిల్లాలో పశుసంపదకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో పెంపకందారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 865 మంది ఉద్యోగులకు గాను 360 పోస్టులు ఖాళీగా ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, పాలు, మాంసం ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, తగినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం పశుసంవర్ధక శాఖ పనితీరును ప్రభావితం చేస్తున్నాయి.
2006 నుంచి ఇప్పటివరకు 5.81ల క్షల గృహాల నిర్మాణం చేపట్టినా 3.02 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 3.03లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందని 2011 జనాభా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చెంచులు, జోగినుల పునరావాసం కోసం ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం కావాల్సి ఉంది.
మేజర్ ప్రాజెక్టులను మినహాయిస్తే నీటి పారుదల శాఖ పరిధిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కోయిల్‌సాగర్ ప్రాజెక్టుతో పాటు, 680 చెరువులు, 5374 కుంటలు ఉన్నాయి. వీటినిర్వహణ, మరమ్మతులపై దృష్టి సారిస్తేనే సాగువిస్తీర్ణం మెరుగవుతుంది.
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో సిబ్బంది కొ రత తాగునీటి ప్రాజెక్టుల పనితీరుపై ప్రభావం చూ పుతోంది. ఈఈ మొదలుకుని ఏఈ స్థాయి వరకు 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సాగునీటి పథకాలకు అదనంగా మరో 874 జనావాసాలకు తాగునీరు అందించేందుకు రూ.689 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. రక్షిత మంచినీటి సరఫరా పథకాలకు చాలాచోట్ల విద్యుత్ కనెక్షన్లు, మోటార్లు సమకూర్చాల్సి ఉంది.
సవాలక్ష
Published Mon, May 26 2014 2:36 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement