సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
మహాకూటమి మిత్రపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూటమి పక్షాలకు ఒకే ఒక్క స్థానం కేటాయించనున్నట్లు కుండబద్దలు కొట్టేసింది. మిత్రపక్షాలు మాత్రం ఉమ్మడి జిల్లాలో మూడు నుంచి ఆరు స్థానాలను కోరాయి. కూటమిలో భాగస్వాములైన టీడీపీకి నాలుగు స్థానాలు, తెలంగాణ జన సమితి రెండు స్థానాలు కోరిన విషయం వదితమే. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే సీటు ఇస్తామని.. మక్తల్ నియోజకవర్గం స్థానంతో టీడీపీ సరిపెట్టుకోవాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. టీజేఎస్‌కు మాత్రం పూర్తిగా మొండి చేయి చూపినట్లు తెలుస్తోంది. దీపావళికి ముందు రోజు కాంగ్రెస్ పార్టీ పేల్చిన బాంబుతో మిత్రపక్షాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది.
కాంగ్రెస్ మార్క్ రాజకీయం !
రాజకీయాల్లో తలపండిన కాంగ్రెస్ పార్టీ తనదైన మార్క్‌ను మరోసారి ప్రదర్శించింది. రాష్ట్ర స్థాయిలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడం కోసం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ రద్దు అనంతరం చాలా వేగంగా పావులు కదిపింది. విపక్ష ఓట్లు చీలకుండా ఉండటం కోసం టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కలిసి మహాకూటమిగా ఏర్పాటు చేసింది. మిత్రపక్షాలకు సముచిత స్థానం కల్పిస్తామంటూ అసెంబ్లీ రద్దు నాటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. తీరా ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో మిత్రపక్షాలకు కేటాయించాల్సిన స్థానాల విషయంలో నాన్చివేత ధోరణిఅవలంభించింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీడీపీ, టీజేఎస్‌లు కొన్ని స్థానాలు కావాలని ప ట్టుబట్టాయి. అందులో భాగంగా టీడీపీ.. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ లేదా జడ్చర్ల స్థా నాలు కావాలని కోరుతోంది. అదే విధంగా తెలంగాణ జన సమితి కూడా మహబూబ్‌నగర్‌తో పా టు కొల్లాపూర్ స్థానాన్ని కేటాయించాలని వి న్నవించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మిత్రపక్షాల స్థానాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇ వ్వకుండా సాచివేత ధోరణి అవలంబించింది. తా జాగా నామినేషన్ల గడువు సమీపిస్తుండడంతో ఒ క్కసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిత్రప క్షాలకు ఒకే ఒక్క స్థానం ఇస్తామంటూ స్పష్టం చేసింది. మిగతా 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే పో టీ చేస్తుందంటూ కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం.
టీడీపీకి మాత్రమే చాన్స్
ముందస్తు ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్న మిత్రపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని కేటాయించింది. అది కూడా టీడీపీకి మాత్రమే మక్తల్ నియోజకవర్గాన్ని కేటాయించినట్లు సమాచారం. వాస్తవానికి టీడీపీ మూడు నుంచి నాలుగు స్థానాలు కావాలని కోరినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందులో భాగంగా కొత్తకోట దయాకర్‌రెడ్డి కోసం మక్తల్ స్థానాన్ని, సీతమ్మ కోసం దేవరకద్ర, రావుల చంద్రశేఖర్‌రెడ్డి కోసం వనపర్తి, ఎర్ర శేఖర్ కోసం మహబూబ్‌నగర్ లేదా జడ్చర్ల కావాలని పట్టుబట్టింది. అయితే వివిధ దశల చర్చల అనంతరం కనీసం మూడు స్థానాలైనా కావాలని కోరింది. కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. మక్తల్ నియోజకవర్గం నుంచి దయాకర్‌రెడ్డి పోటీ చేసే విషయంలో పచ్చ జెండా ఊపినట్లు సమాచారం.
ఒక్క స్థానమూ దక్కని టీజేఎస్
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జేఏసీ నుంచి రూపాంతరం చెందిన తెలంగాణ జన సమితికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క స్థానం కూడా దక్కనట్లు తెలుస్తోంది. టీజేఎస్ పార్టీగా ఏర్పడిన అనంతరం కూడా ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఉమ్మడి జిల్లాలో పలు అంశాలపై విస్తృతంగా పోరాటం చేసింది. అంతేకాదు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం జేఏసీ అధ్యక్షుడిగా పనిచేసిన రాజేందర్‌రెడ్డి తీవ్రంగా కృషిచేశారు. ఈసారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన హార్డ్‌వర్క్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం టీజేఎస్‌కు ఉమ్మడి జిల్లాలో ఒక్క స్థానం కూడా కేటాయించనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో టీజేఎస్ మహబూబ్‌నగర్, కొల్లాపూర్ స్థానాలు కావాలని కోరింది. ఆఖరికి ఒక్క మహబూబ్‌నగర్ స్థానం కేటాయించినా సరిపెట్టుకుంటామని విన్నవించింది. కానీ కాంగ్రెస్ మాత్రం టీజేఎస్ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షాక్‌తో ఉమ్మడి జిల్లాలో టీజేఎస్ పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురుకానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment