సారూ.. ఇదేం తీరు? | applications of welfare schemes not easy to submission in telangana | Sakshi
Sakshi News home page

సారూ.. ఇదేం తీరు?

Published Thu, Oct 16 2014 12:57 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

applications of welfare schemes not easy to submission in telangana

* సంక్షేమ దరఖాస్తుదారులు, తెలంగాణ ప్రభుత్వం, వికలాంగుల పెన్షన్  నిబంధనలతో హడలెత్తుతున్న జనం
* పింఛన్ అందుతుందో లేదోనని భయాందోళనలు.. వితంతువులకు
* భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
* 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారివి ఎక్కడ తెచ్చేదంటున్న దరఖాస్తుదారులు
* సదరం సర్టిఫికెట్ ఉంటేనే వికలాంగులకు పెన్షన్
* ధ్రువపత్రాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి.. గందరగోళం, అయోమయంతో లబ్ధిదారుల్లో టెన్షన్
 
సాక్షి, హైదరాబాద్: ‘సంక్షేమ’ దరఖాస్తుదారుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. పింఛన్లు, ఇతర రూపాల్లో ప్రభుత్వ సాయం పొందాలనుకుంటున్న పేదలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. దరఖాస్తు కేంద్రాలకు పోటెత్తుతున్న జనంతో ఇప్పటికే గందరగోళంగా మారిన ఈ ప్రక్రియ.. కొత్త నిబంధనలతో అస్తవ్యస్తమైంది. దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినప్పటికీ ప్రజల్లో మాత్రం రోజురోజుకూ సందేహాలు పెరుగుతున్నాయి. నానా తిప్పలు పడి దరఖాస్తు చేసుకోవడానికి వెళుతున్న అభాగ్యులకు అధికారులు ఏకరువు పెడుతున్న నియమ నిబంధనలతో చుక్కలు కనిపిస్తున్నాయి.

కొత్తగా ప్రయోజనం పొందాలనుకుంటున్న వారితో పాటు పాత లబ్ధిదారులు కూడా బెంబేలెత్తుతున్నారు. వితంతు, వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ల కోసం, విద్యార్థులు ‘ఫాస్ట్’ పథకం కింద సాయం పొందేందుకు ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి మళ్లీ కొత్తగా ధ్రువీకరణ పత్రాలను పొందే ప్రక్రియ గందరగోళంగా మారడంతో ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణ సర్కారు పేరిట ఇప్పటికే కొంతకాలంగా జారీ చేసిన సర్టిఫికెట్లను కూడా కాదని, అందరూ మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించడంతో ఆయా వర్గాల వారు ఇబ్బందులకు గురవుతున్నారు.

భర్త మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉంటేనే వితంతు పెన్షన్లను పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడంతో వితంతువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 15, 20 ఏళ్ల క్రితం మరణించిన వారి విషయంలో సర్టిఫికెట్లను ఎలా తీసుకురాగలమని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జననమరణాల్లో నమోదు చేసుకుని ఉంటే ధ్రువీకరణ పత్రాలు పొందడం సులువే. అలా లేనిపక్షంలో మాత్రం ఈ సర్టిఫికెట్లను ఎక్కడ, ఎలా పొందాలి, ఎంత సమయంలో ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు. దీంతో ఇక పెన్షన్లు రావేమోనన్న భయాందోళ నలు ఆ వర్గం వారిలో వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు ఈ పెన్షన్ల కోసం డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు విచారణ జరిపి నివేదిక ఇచ్చేవారు. ఒకటి రెండు నెలల సమయంలో ధ్రువపత్రం అందించేవారు. ప్రస్తుతం మండలాలవారీగా వస్తు న్న వేలాది దరఖాస్తులను పరిశీలించి ఈ నివేదికలు ఇచ్చేందుకు అధిక సమయం పట్టే అవకాశముంది. వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సదరం సర్టిఫికెట్లు ఉన్న వారికే పెన్షన్లు ఇస్తారని, అవి లేని వారి కోసం మళ్లీ సదరం క్యాంపులు పెట్టి ఎంత శాతం వైకల్యం ఉందో నిర్ధారించాల్సి ఉంటుందని, ఆ సర్టిఫికెట్ ఇస్తేనే పెన్షన్ మంజూరవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో వికలాంగుల్లో సైతం అందోళన వ్యక్తమవుతోంది.

అదేవిధంగా ఊర్లో లేని వారు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందేందుకు ఏం చేయాలన్నది ఇంకా తేలలేదు. దరఖాస్తు చేసుకోని వారు.. పరిశీలనకు వచ్చినప్పుడు తమ పత్రాలను ఇవ్వవచ్చునని అధికారులు చెబుతున్నా దీనిలో కూడా స్పష్టత లేదు. ముందుగా తెల్ల కాగితంపై వివరాలు రాసి ఇస్తే సరిపోతుందని ప్రకటించిన ప్రభుత్వం... తాజాగా నిర్ణీత నమూనా ఫారాన్ని రూపొందించింది. దీని కాపీలను విక్రయిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులంతా పాత, కొత్తలతో సంబంధం లేకుండా అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొనడంతో అధికారులపై కూడా పని ఒత్తిడి తీవ్రమైంది.
 
ఆ పత్రాలు ఇప్పుడే అక్కర్లేదు
వితంతు పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులతో పాటు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని, వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులతో పాటు సదరం సర్టిఫికెట్లను వెంటనే సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సదరం సర్టిఫికెట్ పొందిన వారు దాన్ని మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
 
నా భర్త ప్రభాకర్ జ్వరంతో ఏడేళ్ల కిందట సచ్చిపోయిండు. నాకు నాలుగేళ్ల నుంచి సర్కారు పింఛన్ ఇత్తంది. ఇప్పుడు కొత్తగా అచ్చిన సర్కారు పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకోవాలని సాటింపు జేసింది. ఈ పింఛన్ పొందాలంటే భర్త సచ్చిపోయినట్టు సర్టిఫికెట్ ఇయ్యాలట. గట్లిత్తెనే పింఛన్ మంజూరు జేత్తరట. ఏండ్ల కితం సచ్చిపోయినోళ్ల సర్టిఫికెట్ ఇప్పుడెక్కడ్నుంచి తీసుకొచ్చుడు.
  -గజెల్లి పోశక్క, నెన్నెల మండలం, ఆదిలాబాద్
 
నా కొడుక్కి పింఛన్ ఇప్పించండి
మాది నిరుపేద కుటుంబం. కూలీనాలి చేసుకొని బతుకుతున్నం. 22 ఏళ్లు వచ్చినా నా కొడుకును నేనే చూసుకోవాలె. మూగోడని, మానసిక వికలాంగుడని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చినా పింఛను రావడం లేదు. బాన్సువాడలో నిర్వహిస్తున్న సదరం క్యాంపునకు పోయినా సర్టిఫికెట్ రాలేదు. అధికారులు దయతలచి నా కొడుక్కు పించన్ ఇప్పించాలి.
 - మద్దెవ్వ, బోధన్, నిజామాబాద్
 
ఖానూన్ మార్చి తక్లీబ్ జేత్తండ్లు
పుట్టుకతోనే నా రెండు కాళ్లు సచ్చుబడిపోయినయ్. నాకు పదేళ్ల నుంచి పింఛన్ అత్తంది. అప్పట్ల పింఛన్ మంజూరప్పుడు సర్టిఫికెట్ అడిగిండ్లు. సూపెట్టినం. దాంతోనే నాకు వికలాంగుల పింఛన్ మంజూరైంది. ఇప్పుడు మళ్ల సర్టిఫికెట్ ఇయ్యాలంటండ్లు. గట్లిత్తేనే పింఛన్ ఇత్తరట. సర్కారు మారినప్పుడల్లా ఖానూన్ మారుత్తండ్లు. కొత్తగా అచ్చిన సర్కారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొమ్మని ఆర్డర్ ఇచ్చి కొర్రీలు పెడ్తంది. గట్లజేయబట్టి మా అసొంటి కుంటోళ్లు, గుడ్డోళ్లకు మస్తు తక్లీబైతంది. పాత సర్టిఫికెట్ల మీదనే పింఛన్ మంజూరు చేయాలె.
 - దూపం భాగ్యలక్ష్మి, నెన్నెల, ఆదిలాబాద్
 
ఏవో కాగితాలు కావలంటున్నారు
నాలుగేళ్ల కింద నా భర్త రోడ్డు ప్రమాదంలో సచ్చిపోయిండు. నాకు ముగ్గురు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లవాడు. నాకు గతంలో వితంతువుల ఫించన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ధరఖాస్తు చేసుకోవాలంటున్నారు. నా భర్త చనిపోయిన కాగితాలు, ఇంకా ఏవో కాగితాలు అడుగుతున్నారు. నాకు ఫించన్ వస్తుందో రాదోనని ఆందోళనగా ఉంది.
 - చింతకాయల రాములమ్మ, పెబ్బేరు, మహబూబ్‌నగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement