ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను అన్వేషించుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. మొత్తం తొమ్మిదింటిలో ఇప్పటి వరకు నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కొన్నిచోట్ల గతంలో పోటీ చేసిన నేతలనే తిరిగి బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నేతలపైనే ఆశలు పెట్టుకుంది.
సాక్షి, నిజామాబాద్: ఉన్నచోట అతివృష్టి.. లేనిచోట అనావృష్టి.. చందంగా తయారైంది జిల్లాలో ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభ్యర్థిత్వం కోసం నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగిన విషయం విధితమే. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులను అన్వేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నేతలపైనే ఆశలు పెట్టుకుంది. జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలకు గాను మొదటి జాబితాలో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
నిజామాబాద్ రూరల్ నుంచి గడ్డం ఆనంద్‌రెడ్డిని, ఆర్మూర్ నుంచి పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ ముగ్గురు కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నిజామాబాద్‌అర్బన్ స్థానానికి కూడా యెండల లక్ష్మీనారాయణకు టికెట్ ఖరారు చేసింది. రెండో విడతలో ఈ స్థానానికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ బలమైన అభ్యర్థులను అన్వేషించుకోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో గతంలో పోటీ చేసిన నేతలనే తిరిగి బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది.
అన్వేషించాల్సిన స్థానాలివే..
ఎల్లారెడ్డి స్థానానికి ముందుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి పేరు వినిపించింది. అయితే ఆయన జహీరాబాద్ ఎంపీగా బరిలోకి దిగాలనే యోచనతో ఉండటంతో ఇతర నేతలను అన్వేషించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ గాదారి అనిత పేరు తెరపైకి వచ్చినప్పటికీ.. ఆమె పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో తిరిగి లక్ష్మారెడ్డినే బరిలోకి దించే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలిసింది. త్వరలో ప్రకటించనున్న మూడో జాబితాలో లక్ష్మారెడ్డి పేరు ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన నేతకు కూడా గాలం వేసే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
- బాన్సువాడ స్థానానికి బీజేపీకి బలమైన అభ్యర్థే కరువయ్యారు. నియోజకవర్గంలో చెప్పుకోదగిన నేతలెవరూ అభ్యర్థిత్వం రే సులో లేరు. పైగా ఇది మంత్రి పోచారం శ్రీ నివాస్‌రెడ్డి స్థానం కావడంతో బలమైన అభ్యర్థి కోసం అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- జుక్కల్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నాయుడు ప్రకాష్‌పేరు పరిశీలనలో ఉంది. ఈ స్థానానికి ప్రస్తుతానికి ప్రకాష్ మినహా, చెప్పుకోదగిన నేతలెవరూ లేరు. లేనిపక్షంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించి భంగపడిన వారు బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
- బాల్కొండలోనూ బీజేపీకి బలమైన అభ్యర్థి లేరు. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్న ధర్మపురి అర్వింద్‌ను బరిలోకి దించాలని పార్టీ భావిస్తోంది. కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో బాల్కొండ స్థానానికి బలమైన అభ్యర్థి వేటలో పడింది.
- బోధన్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి కూడా ఇటీవల బీజేపీకి రాజీనామా చేశా రు. దీంతో ఆ కాస్త బలమున్న నాయకులెవరంటే ప్రశ్నార్థకమే.
రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్న బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాలో ఈ ఐదు స్థానాల్లో మూడు చోట్ల అభ్యర్థులెవరనేది స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు పేర్కొంటున్నారు
Comments
Please login to add a commentAdd a comment