అవినీతికి చెక్!
నిఘా నీడలో ప్రభుత్వ కార్యాలయాలు
నిధుల దర్వినియోగంపై ఆరా
‘ఉపాధి’ అవకతవ కలపైనా కన్ను
బోగస్ లబ్ధిదారుల ఏరివేతపై దృష్టి
రహస్యంగా సమాచారం సేకరణ
ఇప్పటికే కాకిలెక్కలు చూపిన శాఖల గుర్తింపు
ప్రక్షాళన దిశగా నూతన సర్కార్ అడుగులు
సంగారెడ్డి డివిజన్:ప్రభుత్వశాఖల్లో అవినీతి, నిధులు దుర్వినియోగంపై కఠిన వైఖరి అవలంబించే దిశగా తెలంగాణ నూతన సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న నిధుల దుర్వినియోగంపై ఇంటెలిజెన్స్ ద్వారా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది కొత్త పథకాల అమలులో పారదర్శకత పాటించేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించి రహస్య నివేదికలను సేకరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ సొంత జిల్లా కావటంతో ఇంటెలిజెన్స్ అధికారులు తమకు అప్పగించిన పనిని పకడ్బందీగా నిర్వహించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ రాష్ట్ర స్థాయి అధికారులు ఇటీవలే జిల్లాకు వచ్చి వివిధ ప్రభుత్వశాఖల్లో సమాచార సేకరణకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వశాఖల్లో అవినీతి, నిధులు దుర్వినియోగం తదితర వివరాలు సేకరించటంతోపాటు సంక్షేమ పథకాల్లో బోగస్ లబ్ధిదారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. శాఖల వారీగా జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను తీసుకుని, క్షేత్రస్థాయిలో పథకాల అమలు జరిగిన తీరును పరిశీలించి రహస్య నివేదికలు తయారు చేస్తున్నట్లు సమాచారం.
ఇరిగేషన్, ఈజీఎస్ పనుల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి
ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, రాజీవ్‌విద్యామిషన్, హౌసింగ్‌తోపాటు ఇతర ఇంజినీరింగ్ శాఖల పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. చెరువుల మరమ్మతు, సింగూరు కాల్వల పనుల్లో నిధులు దుర్వినియోగం, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలో చోటు చేసుకున్న అవినీతిపై రహస్యంగా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఆయా శాఖల్లో గత ఐదేళ్లుగా చేపట్టిన పనుల వివరాలను తీసుకుని క్షే త్రస్థాయిలో పనులు జరిగిందీ లేనిదీ, పనుల్లో నాణ్యత గురించి క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలో ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అవినీతిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మరీ ముఖ్యంగా పనులు జరగకున్నా పనులు జరిగినట్లు కాకిలెక్కలు చూపుతున్న అధికారుల జాబితాను సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.
ఇటీవల కస్తూర్బా పాఠశాల భవనాల నిర్మాణంలో అధికారులు పనులు పూర్తికాకున్నా ప్రభుత్వానికి పనులు పూర్తయినట్లు నివేదికలు అందజేసినట్లు సమాచారం. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారుల వివరాలు సేకరించి చాలా చోట్ల పనులు పూర్తి కాని విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.
బోగస్ లబ్ధిదారుల వివరాల సేకరణ
సామాజిక పింఛన్లు, తెల్లరేషన్‌కార్డుల్లో బోగస్ లబ్ధిదారుల వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. వృద్దాప్య, వికలాంగులు, వితంతువుల పింఛన్లలో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నట్లు సమాచారం. అలాగే తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారుల్లో వేల సంఖ్యలో బోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నివేదికల ఆధారంగా బోగస్ లబ్ధిదారుల కార్డులను, పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.