సాక్షి, హైదరాబాద్: కోవిడ్ (కరోనా) పేరు వినగానే ఇప్పుడు అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఈ మహమ్మారి పిల్లల జోలికి మాత్రం వెళ్లట్లేదు. ఎందుకని అడిగితే.. తమ వద్ద సమాధానం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. చైనాలో ప్రతి వెయ్యి మందిలో 24 మంది పిల్లలు మాత్రమే కోవిడ్ బారినపడ్డారు. వారిలో కూడా రెండున్నర శాతం మందిలో మాత్రమే తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపించగా.. తీవ్రమైన అనారోగ్యం పాలైంది అంతకంటే తక్కువే. పదేళ్ల వయసు లోపు పిల్లలు ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మరణించింది లేదు.
అందరికీ సోకే వైరస్ పసి పిల్లలపై ప్రభావం చూపకపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఈ విషయమే తమకూ అంతుబట్టట్లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ కుటుంబానికే చెందిన సార్స్, మెర్స్ వైరస్‌లు పిల్లలు, పెద్దలపై ఒకే రకమైన ప్రభావం చూపుతాయని, కానీ కోవిడ్ మాత్రం భిన్నంగా ఉందని అమెరికాలోని క్లీవ్‌లాండ్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ ఫ్రాంక్ ఎస్పర్ చెబుతున్నారు. చిన్న పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండటం, వయసు పెరిగే కొద్దీ ఈ వ్యవస్థ బలహీనపడటం ఒక కారణం కావొచ్చని మరో శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.
ఇతర కారణాలూ ఉన్నాయి..
కొత్త కరోనా వైరస్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపకపోయేందుకు వారి ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు కారణమని తొలుత భావించారు. కాలుష్యం, ధూమపానం వంటి సమస్యల్లేకపోవడం వారికి రక్షణగా నిలిచిందని అంచనా వేశారు. అయితే జలుబు వంటి జబ్బులకు కారణమైన కరోనా వైరస్‌లు పిల్లలకు పలుమార్లు సోకినా వారి రక్తంలో యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఉంటాయి కాబట్టి.. కొత్త కరోనా వైరస్ వారి పై ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పిల్లల శరీరాల్లోని రోగ నిరోధక వ్యవస్థ స్పందన పెద్దల కంటే వేగంగా ఉంటుందని చెబుతున్నారు. చైనాలో 2019 డిసెంబర్ 8 నుంచి ఫిబ్రవరి 6 మధ్య 9 మంది నవజాత శిశువులే కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరారని, వీరిలో ఎవరినీ ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు రాలేదని పేర్కొంటున్నారు. పిల్లలపై వైరస్ ప్రభావం తక్కువగా ఉండేందుకు కారణాన్ని తెలుసుకునేంత వరకు నివారణ చర్యలు తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment