Corona Cases in Hyderabad: డిశ్చార్జీల కంటే.. రెండింతల కేసులు | Positive Cases More Compared to Discharge Cases - Sakshi
Sakshi News home page

డిశ్చార్జీల కంటే.. రెండింతల కేసులు

Published Thu, Jun 11 2020 12:37 PM | Last Updated on Thu, Jun 11 2020 4:44 PM

Coronavirus Spread All over Hyderabad in Danger Situation - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ ఎత్తివేత.. నగరవాసుల్లో సంతోషం కంటే విషాదాన్నే ఎక్కువ పంచనుందా..? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. నగరంలో ఒక్కటొక్కటిగా ఓపెన్‌ అవుతున్న సంస్థలు, సముదాయాలు జనాన్ని అనివార్యంగా రహదారులపైకి తీసుకువస్తున్నంత వేగంగా.. కోవిడ్‌ వైరస్‌ విస్తరణ వేగాన్ని నియంత్రించే దిశగా వ్యక్తులు, యంత్రాంగాలు చర్యలు తీసుకోవడం లేదన్న వాదనలు ముందుకు వస్తున్నాయి. గడిచిన పది రోజులుగా గ్రేటర్‌హైదరాబాద్‌తో పాటు శివారు కార్పొరేషన్లయిన బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేటలలో నమోదవుతున్న కొత్త కేసులుహడలెత్తిస్తున్నాయి. కోవిడ్‌ బారిన పడ్డవారికి సరైన చికిత్సఅందడం, వారి చుట్టూ ఉన్న ప్రైమరి, సెకండరీ వ్యక్తులకు పరీక్షలు చేసే అంశం ప్రహసనంగా మారిందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అసలు వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే.. ఆస్పత్రిలో చేరడం, తమ చుట్టూ ఉన్న వారికి పరీక్షలు చేయించే అంశమే నగరంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిపోయిందన్న ఆందోళనఅందరిలో వ్యక్తమవుతోంది.

స్వీయ నియంత్రణతోనే నివారణ
నగరంలో కరోనా వైరస్‌ ఉధృతి చూస్తుంటే.. విస్తరణ మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బయటకు రాకుండా ఉండటం, బయటకు వచ్చినా మాస్క్‌ తప్పనిసరిగా వాడటం, పని వేళలు తగ్గించి, బలవర్ధకమైన ఆహారం తీసుకుని వ్యాధులను తట్టుకునే శక్తిని పెంచుకోవడం ఒక్కటే నగర వాసుల ముందున్న కర్తవ్యం. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసిందన్న కారణంతో ఇష్టారీతిన ప్రవర్తించకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ తప్పకుండా పాటించాలి.  – డాక్టర్‌ నాగమణి,సూపరింటెండెంట్, పేట్లబుర్జ్‌ ఆస్పత్రి
  
 
మార్కెట్లు..ఆస్పత్రులే.. హాట్‌స్పాట్లు  
నగరంలో ఇప్పటికే పలు మార్కెట్లు, ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా కోవిడ్‌ వైరస్‌ విస్తరణకు హాట్‌స్పాట్లుగా మారిపోయాయి. వ్యాధిగ్రస్తుల్లో భరోసా నింపి వారిని క్షేమంగా ఇళ్లకు పంపాల్సిన ఆస్పత్రుల సిబ్బందే భారీ ఎత్తున వైరస్‌ భారిన పడుతుండటం ఆందోళనకర అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. నగరం, శివారు ప్రాంతాల్లో కలుపుకుని అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అందులో అత్యధికం మార్కెట్లు, ఆస్పత్రుల నుంచి సోకినవే ఉన్నాయి. అయితే తాజాగా షాపింగ్‌ మాల్స్, ప్రార్థనా మందిరాల్లో కార్యక్రమాలకు అనుమతించిన దృష్ట్యా, వ్యాధి నియంత్రణలో పకడ్బంధీ చర్యల్లో ఏ మాత్రం రాజీ పడ్డా అవి మరో కొత్త హాట్‌స్పాట్లు అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  

ట్రిపుల్‌‘టీ’ చేయాల్సిందే..
‘నగరంలో వ్యాధి విస్తరణ ఆగాలంటే.. ‘టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌’లు తప్పని సరి చేయాలి. వ్యాధి సోకిన వ్యక్తి తనంతట తానుగా ఆస్పత్రికి వచ్చి చేరితే ఆయన చుట్టూ ఉన్న వారికి పరీక్షలు చేయకుండా వదిలేయడం, నగరంలో చాలామందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే.. పాజిటివ్‌గా తేలుతున్నారు. ఇలాంటి వారితో మరీ ప్రమాదం. వీరు అంతటా తిరిగి బలహీనంగా ఉన్న వారి ప్రాణాల మీదకు తెస్తున్నారు. ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకుంటే తప్ప ఇప్పట్లో కోవిడ్‌ దారికి వచ్చేలా కనిపించడం లేదు.
– డాక్టర్‌ సి.నాగేశ్వర్, మాజీ ఎంఎల్‌సీ

మాస్కుల తయారీ చకచకా
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలు తప్పని సరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మేడ్చల్‌ జిల్లా అధికార యంత్రాంగం మాస్కుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో.. వైరస్‌ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో మాస్కుల కొరత తగ్గించేందుకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా జిల్లాలోని 156 మహిళా గ్రూపుల్లోని 600 మంది మహిళా సభ్యులు 4.90 లక్షల మాస్కులను తయారు చేయడంతో పాటు ఇందులో 4.11 లక్షల మాస్కులను జిల్లా వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్, మెడికల్‌ అసోసియేషన్లు తదితరులకు విక్రయించారు. అలాగే మరో 6 లక్షల నుంచి 10 లక్షల మాస్కులను తయారు చేసేందుకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు కృషి చేస్తున్నాయి. కీసర, ఘట్‌కేసర్, శామీర్‌పేట్, మూడు చింతలపల్లి, మేడ్చల్‌ మండలాల పరిధిలోని 156 మహిళా సంఘాల ఆధ్వర్యంలో మాస్కులను తయారు చేస్తున్నారు. 4.90 వేల మాస్కులకు సరిపడా క్లాత్‌ను మహిళా సంఘాలకు అందజేసి వాటి తయారీని పరిశీలిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ జ్యోతి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement