నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో కల్తీ జరుగుతోందంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. పౌర సరఫరాల శాఖ అధికారులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కనగల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం నల్లగొండ దేవరకొండ రోడ్డులోని హెచ్‌పీ బంక్ వద్ద తన బైక్‌లో రూ.500 పెట్రోల్ పోయించుకున్నాడు.
అయితే, కొద్దిదూరం వెళ్లేసరికే వాహనం మొరాయించింది. అనుమానం వచ్చిన ఆయన ట్యాంకు కింద ఉండే పైపు ద్వారా పెట్రోల్‌ను బాటిల్‌లోకి పట్టాడు. పెట్రోల్ పైకి తేలుతుండగాఅడుగున అంతా తెల్లటి పదార్ధం ఉంది. దీనిపై ఆయన మరికొందరితో కలసి బంక్ సిబ్బందిని నిలదీశారు. అయితే, నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమివ్వటంతో పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి బంక్‌ను పరిశీలించి, వివరాలు తెలుసుకుంటున్నారు.