దళితుల భూములకు.. ‘రెవెన్యూ’ గండం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గూడు లేని బీదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం 20 ఏళ్ల కిందటే 68మంది దళిత రైతులకు నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని 310, 411, 414, 415, 416, 425 సర్వే నంబర్లలో పంపిణీ చేసిన సుమారు 69.10 ఎకరాల ప్రభుత్వ అసైన్డు భూమిని తిరిగి లాగేసుకునే ప్రయత్నం చేసింది.
నల్లగొండ పట్టణానికి చెందిన బలహీనవర్గాల ప్రజలకు, ఇందిరమ్మ రెండవ విడత గృహసముదాయంలో భాగంగా రాజీవ్‌గృహకల్ప కింద ఇంటి స్థలాలను ఇచ్చేందుకు అధికారులు ఈ స్థలాన్ని ఎంపిక చేయడం వివాదాస్పదం అవుతోంది. అసలు ఒక నియోజకవర్గం పరిధిలోని ప్రజలను మరో నియోజకవర్గం పరిధిలోకి తరలించాలనుకోవడ ంలోనే కుట్ర దాగుం దని, తమ భూములకు అమాంతం విలువ పెంచేసుకునే వ్యూహం దాగుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే భూమిలో 2008 నవంబర్ 17న అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇదంతా
ఇదీ.. అసలు కథ
ప్రభుత్వం భూములు పంపిణీ చేసినా, ఎలాంటి సాగు చేయకుండా నిరుపయోగంగా ఉంచారు కాబట్టి, ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి వెనక్కి తీసేసుకుంటున్నామని, దీనికిగాను కొంత నష్టపరిహారం చెల్లిస్తామని నోటీసులు ఇచ్చింది. దీంతో వివాదం మొదలైంది. ఆరేళ్లుగా ఎల్లారెడ్డిగూడెం దళితులు ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. కనీసం ఈ కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేస్తుందన్న ఆశతో ఉన్నామని వారు వ్యాఖ్యానించారు. కాగా, నల్లగొండ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో బడుగు బలహీనవర్గాలకు ఇళ్లు కట్టిస్తామనడమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీరిలో అత్యధికులు నల్లగొండలోనే చిన్నా చితక పనులు, ఇళ్లలో పనిచేసుకునే మహిళలు తదితరులు ఉంటారు. వీరిని నల్లగొండకు 12 కిలోమీటర్ల దూరానికి తరలిస్తే వారి ఉపాధి ఏం కాను అన్న ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి. ఇది ఒక ఎత్తయితే, రెండు దశాబ్దాలుగా హక్కుదారులుగా ఉన్న దళితుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకోవాలని చూడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో శిలాఫలకం ధ్వంసం
తమకు నష్టపరిహారం అక్కర్లేదని, బొత్స సత్యనారాయణ వేసిన శిలాఫలకాన్ని దళిత రైతులు ధ్వంసం చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు కేసులు కూడా పెట్టారు. సేద్యం చేయడం లేదన్న కారణం చూపెట్టి ఈ భూములను రెవెన్యూ అధికారులు వెనక్కి లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, తాము సేద్యం చేయకుండా ఉండి ఉంటే పంట నష్ట పరిహారం ఎలా చెల్లించారంటూ ఈ రైతుల్లో అత్యధికులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. మరోమారు 2009లో ఇదే ప్రాంతంలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని, భూములు ఇచ్చేయాలని తమపై ఒత్తిళ్లు వచ్చాయని బాధితులు తెలిపారు. ఎకరాకు మొదట రూ.1.28లక్షల నష్ట పరిహారం ఇస్తామని నోటీసులు జారీచేసిన అధికారులు ఆ తర్వాత రూ.2.50లక్షల నుంచి రూ.3.00లక్షల నష్టపరిహారం ఎకరాకు చెల్లిస్తామని నోటీసులు ఇచ్చారు. కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటే రూ.3.50లక్షలు కూడా చెల్లిస్తామని మరో మారు రాయబారం నడిపారు.
రెవెన్యూ అధికారులకు.. ఎందుకంత శ్రద్ధ
సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు నల్లగొండ ఆర్డీఓ కార్యాలయం మరో తాయిలం కూడా ఇచ్చింది. ఎకరాకు రూ.4.50లక్షలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ప్లీడర్ దగ్గర లేఖలు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. దీని వెనుకున్న బలమైన కారణం ఒక్కటే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దళితుల చేతుల్లో ఉన్న ఈ భూములకు మార్కెట్ విలువ ఎక్కువగా ఉంది. ఎకరా భూమి విలువ కనీసం రూ.30లక్షలు పలుకుతుండగా, రోడ్ వెంట ఉన్న భూమికైతే ఎకరాకు అత్యధికంగా రూ.60లక్షల దాకా ఉంది. కొత్త భూసేకరణ చట్టం మేరకు మారిన నిబంధనల ప్రకారం కూడా ఈ భూములను దళితులకే చెందుతాయని అంటున్నారు.
ఉన్న భూమిని కాపాడాలని..
ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎస్సీలకు 3 ఎకరాల సాగుభూమిని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. కనీసం ఈ హామీలో భాగంగానైనా తమకు భూములు పంపిణీ చేయకున్నా, ఉన్న భూములు లాగేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి నల్లగొండలోని బీదలకు గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టించాలంటే.. అది అర్బన్ హౌసింగ్ కిందకు ఎలా వస్తుందన్న ప్రశ్నకు జవాబు చెప్పే అధికారి లేడు. అంతేకాకుండా, ప్రధానమైన మరో అభ్యంతరం కూడా ఉంది. నల్లగొండ నియోకవర్గ ప్రజలకోసం, నకిరేకల్ నియోజకవర్గ ప్రజ ల అసైన్డు భూములు ఎలా లాక్కుంటారు..? ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రెవెన్యూ అధికారులు తమపై పడిపోకుండా చూడాలని దళిత రైతులు కోరుతున్నారు.