ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఖమ్మం : డీసీసీబీ అధ్యక్ష పదవి ఎవరినీ వరిస్తుందనే అంశం అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఉత్కంఠ రేపుతుండగా.. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల ఎన్నికకు ఈనెల 20వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఎన్నికల ప్రక్రియను ఈనెల 21వ తేదీన ప్రారంభించి.. 29వ తేదీ వరకు ముగించాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించింది. 28వ తేదీన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) డైరెక్టర్ల ఎన్నిక, 29వ తేదీన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య జిల్లా సహకార శాఖ అధికారులు, డీసీసీబీ ఈఓలతో సమావేశమయ్యారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో ఓటర్లుగా ఎవరెవరు అర్హులో గుర్తిస్తూ.. తక్షణమే ఓటర్ల జాబితా ఇవ్వాలని.. ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులతోపాటు వ్యవసాయేతర సహకార సంఘాలు ఎన్ని ఉన్నాయి..
వాటిలో డీసీసీబీ, డీసీఎంఎస్‌లో ఓటు కలిగి ఉండే అర్హత ఉన్న సంఘాలు ఎన్ని అనే అంశంపై రాష్ట్ర సహకార శాఖ జిల్లా అధికారులను ఓటర్ల జాబితాతో సహా నివేదిక కోరింది. ఈనెల 18వ తేదీ సాయంత్రం సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య మరోసారి జిల్లా సహకార శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 21 డీసీసీబీ డైరెక్టర్ పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. డైరెక్టర్‌గా ఎన్నికైన వారి నుంచి డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు.. అలాగే డీసీఎంఎస్ డైరెక్టర్లుగా ఎన్నికైన వారి నుంచి డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 101 పీఏసీఎస్‌లు ఉండగా.. అన్నింటికీ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో రెండు ములుగు జిల్లాలో..
రెండు మహబూబాబాద్ జిల్లాలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21,
ఖమ్మం జిల్లాలో 76 సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల అధ్యక్షులు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లను ఎన్నుకుంటారు. డీసీసీబీలో 16 మంది డైరెక్టర్లను సహకార సంఘాల అధ్యక్షులు, ఐదుగురు డైరెక్టర్లను 192 వ్యవసాయేతర సహకార సంఘాల అధ్యక్షులు ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌కు 13 మంది డైరెక్టర్లు ఉంటారు.. ముగ్గురు వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. 10 మంది డైరెక్టర్లు ఉంటారు. అందులో 6 సహకార సంఘాల నుంచి ఎన్నుకోబడతారు. నలుగురు వ్యవసాయేతర సహకార సంఘాల నుంచి ఎన్నుకోబడతారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఖమ్మం జిల్లా సహకార శాఖ అధికారి రాజేశ్వర శాస్త్రి, డీసీసీబీ సీఈఓ వసంతరావు, డీసీఎంఎస్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్ష పదవులకు హోరాహోరీ
అధ్యక్ష పదవులకు హోరాహోరీ పోటీ నెలకొంది. ఇప్పటికే పీఏసీఎస్ అధ్యక్షులుగా ఎంపికైన వారిలో అనేక మంది ఈ పదవిని ఆశిస్తుండగా.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఏ ప్రాతిపదికన.. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీకి చెందిన నేతలు, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరు బ్రహ్మయ్య, రాయల శేషగిరిరావు, బీసీలకు అవకాశం ఇచ్చిన పక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పలువురు నేతలు డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం సహకార సంఘ అధ్యక్షులు కూరాకుల నాగభూషణం, పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, వైరా సహకార సంఘం అధ్యక్షులు బొర్రా రాజశేఖర్ తదితరులు ఈ పదవికి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక డీసీఎంఎస్ చైర్మన్ పదవికి సైతం ఇదే స్థాయిలో పోటీ నెలకొంది. డీసీసీబీ అధ్యక్ష పదవి దక్కకపోయినా డీసీఎంఎస్ పదవి వరిస్తుందనే ఆశతో కొందరు నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment