కరీంనగర్ సిటీ: జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికల్లో భాగంగా బుధవారం అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రూరల్ 18, అర్బన్ ఆరు స్థానాలకు ఈనెల 29న ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య జెడ్పీ సీఈవో చాంబర్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
కాంగ్రెస్ ఖాతాలో ఒక సీటు
రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 18స్థానాలకుగాను ఒక స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే సారంగాపూర్ మాత్రమే ఎస్టీ మహిళా రిజర్వేషన్‌లో ఉంది. అక్కడినుంచి కాంగ్రెస్‌కు చెందిన భూక్యా సరళ జెడ్పీటీసీగా ఉన్నారు. ఆమె ఒక్కరే ఈ స్థానానికి అర్హురాలు కావడంతో ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి అనివార్యంగా వెళ్లనుంది. టీఆర్‌ఎస్ 17 స్థానాలకే పోటీపడుతోంది.
ఖరారైన టీఆర్‌ఎస్ జాబితా
జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల ఎంపికపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ జాబితా ఖరారైంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు,పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ రూరల్ జాబితాను 17 మందితో ఖరారు చేశారు. ఇందులో నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జి సూచించిన వారితోపాటు మిగిలిన నాలుగు స్థానాలకు సీనియర్లను తీసుకున్నట్లు సమాచారం. అర్బన్ నియోజకవర్గానికొస్తే మొత్తం ఆరు స్థానాల్లోనూ పోటీచేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది.
కరీంనగర్, రామగుండం నగరపాలకసంస్థలతోపాటు జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, సిరిసిల్ల మున్సిపాల్టీలున్నాయి. ఈ ఆరింటిలో ఒక్కొక్కరు చొప్పున ఆరుగురిని ఎంపిక చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఆ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. కొత్తగా ఏర్పడిన నగరపంచాయతీలకు డీపీసీలో ప్రస్తుతానికి ప్రాతినిథ్యం ఇవ్వలేదు.
కాంగ్రెస్ సమాలోచన
డీపీసీ ఎన్నికల్లో పోటీచేయాలా..? వద్దా..? అనే మీమాంసలో కాంగ్రెస్ నాయకులు పడ్డారు. మంగళవారం జెడ్పీటీసీలు, కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం భావించినప్పటికీ వెంకటస్వామి మృతితో అది వీలుపడనట్లు సమాచారం. రూరల్‌లో ఒకటి తమకు వస్తున్నా.. అర్బన్‌లో కనీసం ఒక్క సీటైనా కాంగ్రెస్‌కు కేటాయించకపోవడంపై పార్టీ నాయకులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.
జగిత్యాల మున్సిపాల్టీ తమ చేతిలోనే ఉండడం, ఇతరమున్సిపాల్టీల్లోనూ ప్రభావితం చేసే స్థాయికి కౌన్సిలర్ల సంఖ్య ఉందని, సీటు కేటాయించకపోతే పోటీ చేయాల్సిందేనని కొంతమంది ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతగా బలం లేకపోవడంతో ఏకగ్రీవానికి సహకరించి గౌరవం దక్కించుకోవాలని మరికొంతమంది సూచిస్తున్నారు. బుధవారం నామినేషన్‌లు వేయాలని కరీంనగర్ నగరపాలకసంస్థ కాంగ్రెస్ కార్పొరేటర్లు సమాలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ వ్యూహం ఏమిటో నేడు వెల్లడి కానుంది.
ఓటుకు కౌన్సిలర్ అనర్హురాలు: జిల్లాప్రణాళిక కమిటీ ఎన్నికల్లో పెద్దపల్లి నగరపంచాయతీ కౌన్సిలర్ రజిత ఓటు వేయడానికి అనర్హురాలుగా అధికారులు ప్రకటించారు. సొంత పార్టీ విప్‌ను ధిక్కరించిన ఫలితంగా ఆమెను అనర్హురాలుగా ప్రకటించారు. గతంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చినా.. స్టే కాలం ముగియడంతో నగరపంచాయతీ కమిషనర్ సూచన మేరకు డీపీసీలో ఓటు వేయడానికి అనర్హురాలుగా తేల్చారు. దీనితో అర్బన్ నియోజకవర్గంలో 320 ఓట్లకు 319 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
నేడే డీపీసీ నామినేషన్లు
Published Wed, Dec 24 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement