కల చెదిరి.. గుండెపగిలి...
మహబూబ్‌నగర్: పొలంలో పంటను చూసి ఆ రైతు తెగ మురిసిపోయాడు. ఇక అప్పుల ఊబి నుంచి బయటపడినట్లేనని తెగ సంబరపడిపోయాడు. ఇంతలోనే అకాల వర్షం ఆ రైతు జీవితాన్ని అతలాకుతలం చేసింది. కల చెదిరి.. గుండె పగిలింది. ఈ హృదయ విదారక సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
మాగనూరు మండలం తంగిడి గ్రామపంచాయతీ కుసుమర్తి గ్రామానికి చెందిన పోలీస్ చిన్నమల్లికార్జున్(50)కు సమీపంలోని కృష్ణానది తీరంలో ఆరెకరాల పొలం ఉంది. దీనికితోడు మరో నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరిపంట సాగుచేశాడు. ఇందుకోసం లక్ష రూపాయలు అప్పు చేశాడు. ప్రతిరోజు పంటను చూసి సంబరపడి పోయేవాడు.
అయితే, ఇటీవల కురిసిన వడగళ్లవానకు పంటంతా నేలవాలడంతో వడ్లగింజలు రాలిపోయాయి. ఉదయం పొలం వద్దకు వెళ్లి నేలకొరిగిన పంటను చూసి తీవ్రంగా కలత చెందాడు. ఇంటికొచ్చి ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. పరిస్థితులను తలుచుకుని చిన్నమల్లికార్జున్ గుండెపోటుతో మరణించాడు.