ప్రీ-సర్వే... గందరగోళం | free poll chaos ... | Sakshi
Sakshi News home page

ప్రీ-సర్వే... గందరగోళం

Published Mon, Aug 18 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

free poll chaos ...

ముషీరాబాద్ జోన్ బృందం : తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేకు ఆదిలోనే అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లలో మొదటి రోజు ఇంటింటికీ వెళ్ళి సర్వే ఫారాలను అందించే క్రమంలోనే ఇలాంటి అడ్డంకులు ఎదురైతే 19వ తేదీన సర్వే పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా సర్వే ఫారాలు కావాల్సినన్ని అందించకపోవడం, సకాలంలో రాకపోవడం, ఇంటింటికీ అందించే స్టిక్కర్లు సైతం సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఎన్యూమరేటర్లకు కేటాయించిన అసోసియేట్ ఎన్యూమరేటర్లు గైర్హాజరు కావడంతో ఫారాల పంపిణీ నత్తనడకన సాగింది. మొదటిరోజు కేవలం సగం ఫారాలే పంపిణీ చేశారు.  

గాంధీనగర్‌లో 160మంది అసోసియేట్ ఎన్యూమరేటర్లు గైర్హాజర్..

అసోసియేట్ ఎన్యూమరేటర్లు సమగ్ర సర్వే నిర్వహించేందుకు ఈ రోజు హాజరు కావాల్సిన 160 మంది గైర్హజయ్యారని దీనివల్ల ఇబ్బందులు తప్పవని గాంధీనగర్ డివిజన్ 93-వార్డు సర్వే నోల్ అధికారి సుదర్శన్ తెలిపారు. సమగ్ర సర్వేకు డివిజన్ 93-వార్డులో 56 మంది ఎన్విరేటర్లు, 6గురు క్లస్టర్ ఇన్‌చార్జిలు ,40 మంది అసోసియేట్ ఎన్యూమరేటర్లు హాజరైనట్లు తెలిపారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో క్లస్టర్లకు, ఎన్యూమరేటర్లకు, అసోసియేట్ ఎన్యూమరేటర్లకు సర్వే బుక్స్‌ను, స్టిక్కర్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని అప్పుడే ఈ సర్వే విజయవంతం అవుతుందన్నారు. ఆరోరా కళాశాలకు చెందిన 160 మంది అసోసియేట్ క్లస్టర్లు రావాల్సి ఉండగా రాలేదన్నారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసిన వారు ఏలాంటి స్పందన లేదన్నారు. దీనికి రేపు కూడా హజరు కాకపోతే ఇక్కడ నిర్వహించే సర్వే విజయవంతం కాదన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జీలు, ఎన్విరేటర్లు అనంతరాములు, విజయరావు, సుధాకర్, మంజులసింగ్, సాయినాథ్, రాజేష్, సదానంద్, వేణుగోపాల్‌రావు, పద్మశ్రీ పాల్గొన్నారు.   
 
6 బస్తీలను వదిలేసిన ఎన్యూమరేటర్లు
 
ఈ నెల 19వ తేదీన జరుగనున్న సమగ్ర సర్వేలో భాగంగా ఆదివారం ముషీరాబాద్, భోలక్‌పూర్ డివిజన్లల్లో నోడల్ అధికారి, క్లస్టర్లు, ఎన్జుమలేటర్లు ఇంటింటికి తిరుగుతూ పత్రాలను పంపిణీ చేశారు. ముషీరాబాద్ డివిజన్ వార్డు నెంబరు -91 విషయానికొస్తే ఆరుగురు క్లస్టర్లు, 58 మంది ఎన్జుమలేటర్లు , 190 మంది అసోసియేట్ ఎన్జుమలేటర్లు ఇంటింటికి తిరుగుతూ పత్రాలను పంపిణీ చేశారు. అయితే ఉదయం 7 గంటలకు వచ్చిన 58 ఎన్జుమలేటర్లు సహాయకులు సకాలంలో రాకపోవడంతో చాలాసేపు కమ్యూనిటీహాల్‌లోనే కూర్చున్నారు. దాదాపు 11 గంటల తర్వాత ప్రారంభమైనప్పటికి సరిపడా చెక్ లిస్టు  పత్రాలు పరిపోకపోవడంతో సహాయకులు నచుడుకుంటూ కమ్యూనిటీహాల్ వద్దకు వచ్చి పత్రాలను తీసుకెళ్లారు.
 
భోలక్‌పూర్‌లో...
 
భోలక్‌పూర్‌లో 19 బస్తీలున్నప్పటికీ బ్యాంక్ కాలనీ, సంజీవయనగర్, టి.అంజయ్యనగర్, భోలక్‌పూర్ హౌస్, వెంకటేశ్వర్‌నగర్ తదితర బస్తీల్లో ఎన్జుమలేటర్లు అసలు తిరగలేదు. డివిజన్‌లో 67 మంది ఎన్యూమరేటర్లు, 5 గురు క్లస్టర్లు, 200మంది వరకు అసోసియేట్ ఎన్యూమరేటర్లు పాల్గొన్నప్పటికీ చాలా బస్తీల్లో పర్యటించకుండా, చాలా చోట్లల్లో స్టిక్కర్లు అతికించకుండా వదిలేశారు. ముస్లిం ఇళ్లల్లో కుటుంబ సభ్యుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికి ఒకే పత్రాన్ని ఇచ్చారు.  
 
ఉర్దూలో పత్రాలు లేకపోవడంతో ఇబ్బంది పడ్డ ముస్లింలు
 
భోలక్‌పూర్‌లో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు. అయితే చెక్‌లిస్టు పత్రాలు తెలుగు, ఇంగ్లీషులో మాత్రమే ఉన్నాయి. భోలక్‌పూర్‌లోని ముస్లిం బస్తీల్లో పర్యటించి ఎన్యూమరేటర్లు ఇచ్చిన పత్రాలను చూసి చాలా మంది ముస్లింలు ఏమీ రాయాలో తెలియని అయోమయస్థితిలో పడిపోయారు.
 
నోడల్ అధికారిపై కార్పొరేటర్ ఆగ్రహం
 
భోలక్‌పూర్ డివిజన్‌లో చెక్‌లిస్టు పత్రాల పంపిణీ గందరగోళంగా మారింది. చాలా బస్తీలను వదిలేశారని, తన ఇంటికే ఇంకా రాలేదని స్థానిక కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ అన్నారు. అయితే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న భోలక్‌పూర్‌లో చెక్‌లిస్టు పత్రాలు కేవలం ఇంగ్లీషు, తెలుగులో ఉండటం, ఉర్దూలో లేకపోవడం, ఆరు బస్తీలను వదిలేయడం పై కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ నోడల్ అధికారి అశ్వినికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉర్దూలో పత్రాలు లేవని, ముస్లింల కోసం ఉర్దూలో తెప్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, జోనల్ కమిషనర్‌కు మెస్సేజ్ చేశామని కార్పొరేటర్ తెలిపారు. అంతేకాదు పత్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబిసీ, ఓసీ కులస్తులకే మాత్రం నమోదు చేసే విధంగా ఉందని, ముస్లింల కోసం ‘బీసీ’అని లేదని, బీసీ అని ఉంటే దాని పక్కనే ముస్లిందరం బీసీ (ఈ) అని నమోదు చేసుకునే అవకాశం ఉండేదన్నారు.
 
అడిక్‌మెట్ డివిజన్‌లోని అడిక్‌మెట్ కమ్యూనిటీహాల్‌లో ఏర్పాటు చేసిన ఫారాల పంపిణీ కార్యక్రమానికి ఉదయం 7 గంటలకు అధికారులు వచ్చినప్పటికీ సరిపడా ఫారాలు లేకపోవడంతో కొంతమంది ఎన్యూమరేటర్లు మధ్యాహ్నం రెండు తరువాత పంపిణీ చేయడానికి వెళ్ళారు.
     
ఒక ఎన్యూమరేటర్‌కు 40 ఇళ్ళను కేటాయించగా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ప్రాంతంలో ఉండటం, ఇంటి నెంబర్లు గుర్తించలేకపోవడంతో కొంతమంది 15 నుంచి 20 ఇళ్ళకు మాత్రమే ఫారాలను పంపిణీ చేశారు. వారికి ఇంటి నెంబర్లు కనుక్కోవడం కష్టతరమైంది. వారు స్థానికులు కాకపోవడం, మహిళా ఉద్యోగులు కావడంతో ఇబ్బందులెదురొన్నారు.
     
ఇంటి నెంబర్ల ప్రకారం ఫారాలను అందజేయడంతో ఒక ఇంటినెంబరుపై ఒక అపార్ట్‌మెంట్ ఉండటం, అందులో నలబై యాభై ఫ్లాట్లు ఉండటంతో ధరఖాస్తు ఫారాలు లేక పంపిణీ జరగలేదు. పైగా తనకు కేవలం 40 ఇళ్ళనే కేటాయించారని, ఆపై కేటాయించిన వాటిని మాత్రం నేను సర్వే చేయమని ఎన్యూమరేటర్లు మొరాయించారు.
     
అడిక్‌మెట్ డివిజన్‌లోని మార్క్స్ భవన్, మేడిబావి బస్తీ తదితర ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా నివశిస్తున్నారు. అయితే వారికి తెలుగు ఫారాలు పంపిణీ చేయడంతో వాటిని ఎలా పూర్తి చేయాలో వారికి అర్థం కావడం లేదు.
     
కవాడిగూడ డివిజన్‌లో కేటాయించిన ఎన్యూమరేటర్లకు సహాయక ఎన్యూమరేటర్లు సరైన  సమయానికి రాకపోవడం కారణంగా సుమారు మూడు గంటలకు పైగా ఎన్యూమరేటర్లు ప్రీ-సర్వేను ప్రారంభించడం ఆలస్యమైంది. ఎన్యూమరేటర్లే  స్థానికులను సహాయకులుగా  అప్పగించిన పనిని పూర్తి చేశారు.
     
ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే కరపత్రాలు, స్టిక్కర్లు సరిపడా అందకపోవడంతో డివిజన్ వ్యాప్తంగా పూర్తి కావాల్సిన ప్రీ-సర్వే పూర్తి కాలేకపోయింది. కరపత్రాలు అధిక భాగం తెలుగులోనే ఉండటంతో ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో మాట్లాడి, చదివే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
     
సాయంత్రం పూట ప్రీ-సర్వే పూర్తయిన తరువాత ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరే షన్ కోసం సుమారు రెండు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement