కాంగ్రెస్‌కు జవసత్వాలు
15 రోజుల్లోగా నూతన కమిటీల ఏర్పాటుకు నిర్ణయం
అన్ని వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించిన దిగ్విజయ్
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్‌జతో జిల్లా నేతల భేటీ
వరంగల్ : సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో నూతన జవసత్వాలు కల్పించి తద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు అధినాయకత్వం నిర్ణయించింది. వచ్చే 15 రోజుల్లో బూత్ స్థాయి నుంచి గ్రామ, డివిజన్, మండల, జిల్లా వరకు నూతనంగా పార్టీ, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలని, డిసెంబర్ 31 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో తెలంగాణ పీసీసీ విసృత సమావేశం సందర్భంగా సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో జిల్లా ముఖ్యనేతలు భేటీ అయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పార్టీ నాయకులు ఈవీ శ్రీనివాసరావు, నాగరాజు, కిషన్, శ్రీనివాస్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల టీఆర్‌ఎస్ పాలనపై కాంగ్రెస్ చేపట్టిన ధర్నా, మెదక్ ఎన్నికల ప్రచారంలో జిల్లా నేతల భాగస్వామ్యంపై దిగ్విజయ్‌సింగ్‌కు నివేదిక సమర్పించారు.
గత నెల హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ మేధోమథన సదస్సు తర్వాత చేపట్టిన కార్యకలాపాలపై సమీక్షించారు. పార్టీ నూతన కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, ప్రతీ నెల కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని దిగ్విజయ్‌సింగ్ వారికి స్పష్టం చేశారు. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పూర్తిగా సిద్ధం కావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి జిల్లాలో రాష్ర్ట స్థాయి సభను నిర్వహించే అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కాగా, ఈ విసృత సమావేశానికి జిల్లాలోని ఏకైక ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ హాజరు కాలేదు.