సదస్సు సాఫీగా సాగేనా? | telengana congress Conference taking place smoothly? | Sakshi
Sakshi News home page

సదస్సు సాఫీగా సాగేనా?

Published Sun, Aug 24 2014 12:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సదస్సు సాఫీగా సాగేనా? - Sakshi

సదస్సు సాఫీగా సాగేనా?

ఏర్పాట్లపై కాంగ్రెస్ పెద్దలతో రాష్ర్ట నేతల భేటీ
గొడవలు జరిగితే పార్టీ పరువు పోతుందని దిగ్విజయ్‌సింగ్ ఎదుట ఆవేదన
కార్యకర్తల కోపాన్ని సదస్సు వేదికగా అర్థం చేసుకోవాలన్న వీహెచ్
పార్టీ బలోపేతానికే పరిమితమవుదామన్న మల్లు రవి
కోపంతో కుర్చీలు తన్నుకుంటూ సమావేశం నుంచి బయటకొచ్చిన వీహెచ్
సోనియా, రాహుల్ రావడం లేదని సంకేతాలిచ్చిన దిగ్విజయ్

 
హైదరాబాద్: ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు తలపెట్టిన సదస్సుపై ఉత్కంఠ నెలకొంది. ఇది సజావుగా సాగుతుందో లేదోనన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ‘కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’పైనే ప్రస్తుతం పార్టీ శ్రేణులన్నీ దృష్టి సారించాయి. సదస్సును ఎలాగైనా విజయవంతం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా పార్టీ ముఖ్యులంతా ఈ ఏర్పాట్లలో మునిగిపోయారు.అన్ని స్థాయిల్లో కలిపి సుమారు 2వేల మంది సదస్సుకు హాజరయ్యే అవకాశముంది. అయితే ఎన్నికల్లో ఓటమికి పార్టీ ముఖ్య నేతలే కారణమని ఆగ్రహంతో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు సదస్సులో గొడవ చేసే అవకాశాలున్నాయనే  భావనతో ముఖ్య నేతలు ఉన్నారు.

సదస్సులో ఏ చిన్న గొడవ జరిగినా ఆ ప్రభావం మెదక్ ఉప ఎన్నికపై పడుతుందనే ఆందోళన కాంగ్రెస్ పెద్దల్లో వ్యక్తమవుతోంది.ఈనేపథ్యంలో శనివారం రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్‌సింగ్ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్, ఉపనేత షబ్బీర్ అలీతోపాటు సీనియర్ నేతలు వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, డీకే అరుణ,శ్రీధర్‌బాబు, కె.ఆర్.సురేష్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి, భట్టి విక్రమార్క, రాజయ్య, పొన్నం, దామోదర్‌రెడ్డి సహా దాదాపు 40 మంది నాయకులు ఈ భేటీకి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి.

తొలుత దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఇచ్చినందున మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ఆశించినా అది జరగలేదు. అసలెందుకు ఓడిపోయాం? పార్టీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి? అనేఅంశంపై మాట్లాడేందుకే సదస్సును పరిమితం చేద్దాం’ అన్నారు. ఈ సదస్సుకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రావడం లేదని ఈ సందర్భంగా వెల్లడించారు.
  వీహెచ్ మాట్లాడుతూ.. ‘కార్యకర్తలు తమ బాధను చెప్పుకొనేందుకు సదస్సులో అవకాశమివ్వాలి. వాళ్ల కడుపులో ఉన్నదంతా కక్కేశాక మిగిలిన అంశాలు మాట్లాడుకుందాం’ అని పేర్కొన్నారు. మల్లు రవి జోక్యం చేసుకుంటూ.. దాన్ని వారించారు.

 వెంటనే వీహెచ్ లేచి మాట్లాడబోతుండగా అడ్డుతగిలిన దిగ్విజయ్‌సింగ్ కూర్చోమని చెప్పారు.అసహనానికి లోనైన వీహెచ్ ‘నేను మాట్లాడుతుంటే వినరేంది?’ అంటూ కోపంతో పక్కనే ఉన్న కుర్చీలను తన్నుకుంటూ సమావేశం నుంచి వెళ్లబోయారు. కుంతియా ఆపడానికి ప్రయత్నించినా వినకుండా రుసరుసలాడుతూ అర్ధంతరంగా వెళ్లిపోయారు.
 
ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘ఓడిపోయినా కాంగ్రెసోళ్లకు సిగ్గురాలేదంటూ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. రేపటి సదస్సులోనూ గొడవ జరిగితే పరువు పోతుంది. అంతా సానుకూల దృక్పథంతో చర్చించుకోవాలి’ అని సూచించారు. పొన్నం ప్రభాకర్ ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మండిపడ్డారు. కిరణ్ వల్లే పార్టీ సర్వనాశనమైందని, అలాంటి వ్యక్తి ఫొటోను ఇంకా గాంధీభవన్‌లో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. తక్షణమే ఆ ఫొటోను తొలగించాలని డిమాండ్ చేశారు.

 కేఆర్ సురేష్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చిత్తరంజన్ దాస్ తదితరులు టీపీసీసీ అధ్యక్ష మార్పు అంశాన్ని లేవనెత్తారు. పొన్నాలను తప్పిస్తున్నారంటూ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దిగ్విజయ్‌సింగ్ మాత్రం వారి చెప్పింది రాసుకున్నారే తప్ప పొన్నాల మార్పుపై స్పందించలేదు. కాగా, సీనియర్ నేతలు జానారెడ్డి, డీఎస్ కూడా ఇతర నేతలు చెప్పింది వినడానికే పరిమితమయ్యారు. ఎలాంటి సూచనలూ చేయలేదు.ట
 
మెదక్ ఎంపీ అభ్యర్థిపై  కసరత్తు

హైదరాబాద్: మెదక్ లోక్‌సభ సీటు ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్  శనివారం గాంధీభవన్‌లో పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు. సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్‌సహా పార్టీ ముఖ్య నేతలతో దిగ్విజయ్‌సింగ్ విడివిడిగా సమవేశమయ్యారు. ఆ తరువాత మెదక్ జిల్లా నేతలతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మెజారిటీ నేతలు మాజీమంత్రి సునీత లక్ష్మారెడ్డి పేరును సూచించారని తెలిసింది.  కొందరు జగ్గారెడ్డి లేదా దామోదర రాజనర్సింహకు టికెట్ ఇవ్వాలని సూచించినట్టు సవూచారం. అనంతరం దిగ్విజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ మెదక్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. అందరి అభిప్రాయం మేరకు అభ్యర్థిని ఖరారు చేస్తామన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో తెలంగాణ ఇచ్చినా ఎందుకు ఓడిపోయామనే అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement