సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలోనే ఏకైక వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల దశ తిరగనుంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఉన్న వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల పూర్తిస్థాయి క్యాంపస్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సంగారెడ్డి మండలం కందిలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ పక్కనే వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చొరవ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులకు రూ.19.70 కోట్ల నిధులు విడుదల చేసింది. రాబోయే బడ్జెట్‌లో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి పూర్తిస్థాయి నిధులు కేటాయించే అవకాశం ఉంది. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం పనులకు శంకుస్థాపన జరగనుంది.
మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి 2011లో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరైంది. సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలోని భవనంలో ప్రస్తుతం కళాశాల కొనసాగుతోంది. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ అగ్రికల్చర్ కోర్సు ఉంది. నాలుగేళ్ల వ్యవధి గల ఈ కోర్సులో ప్రస్తుతం 240 మంది విద్యార్థులు కొనసాగుతున్నారు. కళాశాల డీన్ సహా 12 మంది బోధనా సిబ్బందితోపాటు అవసరమైన బోధనేతర సిబ్బంది ఉన్నారు. కళాశాలలోని విద్యార్థిని, విద్యార్థుల కోసం వేర్వేరుగా సంగారెడ్డిలోనే హాస్టళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న చోట తరగతుల నిర్వహణ, ల్యాబ్స్ నిర్వహణ కోసం గదులు సరిపోవటం లేదని, పూర్తిస్థాయి మౌలిక వసతులతో కళాశాల క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి సంగారెడ్డి మండలం కంది శివారులో ఐఐటీ పక్కనే స్థలం ఉన్నట్లు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వ్యవసాయ ఇంజనీరింగ్ క ళాశాల నిర్మాణం అవసరం ఉందని, అవసరమైన నిధులు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, జిల్లా మంత్రి హరీష్‌రావును కోరారు. దీంతో ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం ఏర్పాటు కోసం తొలి విడతగా రూ.19.70 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ నిర్మాణం పనులు చేపట్టనున్నారు. 21 ఎకరాల్లో అన్ని సదుపాయాలతో ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ నిర్మించనున్నారు. ఇందులో విద్యార్థుల కోసం కళాశాల, హాస్టళ్లు, ల్యాబ్స్, వర్క్‌షాప్‌లు, పరిపాలన భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్, క్రీడామైదానాలు నిర్మించనున్నారు.
త్వరలోనే శంకుస్థాపన: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
తెలంగాణలోనే ఏకైక వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల సంగారెడ్డిలో ఉంది. కళాశాల పూర్తిస్థాయి క్యాంపస్ నిర్మాణం కోసం సీఎంను నిధులు కోరిన వెంటనే పెద్ద మనస్సుతో నిధులు విడుదల చేశారు. నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్‌రావుకు ధన్యవాదాలు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తాం.
సాగు సదువుకు సర్కార్ ప్రోత్సాహం
Published Sun, Dec 14 2014 10:48 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement