ఉద్దండుల గడ్డ | Great Persons Win In Narsapur Constituency | Sakshi
Sakshi News home page

ఉద్దండుల గడ్డ

Published Mon, Nov 12 2018 11:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Great Persons Win In Narsapur Constituency - Sakshi

నర్సాపూర్‌నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు సీపీఐ, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీలుగా పోటీ పడ్డాయి. ఐదుసార్లు సీపీఐకి చెందిన ఒకే అభ్యర్థి చిలుముల విఠల్‌రెడ్డి గెలుపొంది రికార్డు సృష్టించారు. 1999లో జరిగిన ఎన్నికల్ల విఠల్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతారెడ్డి విజయం సాధించి కమ్యూనిస్టుల కోటను కైవసం చేసుకున్నారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో సైతం సునీతారెడ్డి గెలిచి హ్యాట్రిక్‌ విజయం అందుకున్నారు. అనంతరం మంత్రి పదవి చేపట్టారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన 
విఠల్‌రెడ్డి సీపీఐ శాసనసభ పక్ష నేతగా పనిచేయగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగన్నథరావుకి డిప్యూటీ సీఎం పదవి వరించింది.    

రాయరావు నరసన్న పేరుతో నర్సాపూర్‌..
సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల్ల మండలం నల్లవల్లి గ్రామానికి చెందిన దేశ్‌ముఖ్‌ల వంశీయుడైన రాయరావు నరసన్న 1590సంవత్సరంలో ఇక్కడ గ్రామం కోసం పునాదులు వేశారని తెలిసింది. అయన పేరు మీదే నర్సాపూర్‌ ఏర్పడింది.

చుట్టూ దట్టమైన అడవులు..
ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు నర్సాపూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలో 19,147 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండేవి. కాగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు అటవి శాఖలోని రేంజ్‌లను చిన్నవిగా చేయడంతో ప్రస్తుతం సుమారు 5450 హెక్టార్లకు తగ్గాయి.

చిరకాల ప్రత్యర్థులుగా నిలిచిన విఠల్‌రెడ్డి, జగన్నాథరావు..
నర్సాపూర్‌ శాసన సభ నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరుగగా 8సార్లు సీపీఐ అభ్యర్తిగా విఠల్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్తిగా జగన్నా«థరావులు పోటీ పడ్డారు. ఐదు సార్లు విఠల్‌ రెడ్డి గెలుపొందగా, మూడు సార్లు జగన్నాథరావు విజయం సాధించారు.

ఖాతా తెరవని టీడీపీ..
నర్సాపూర్‌ నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలుపొందలేదు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలో సీపీఐతో పొత్తు ఉండడం, నర్సాపూర్‌లో సీపీఐకి మంచి పట్టు ఉండడంతో నర్సాపూర్‌ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా సీపీఐకే కేటాయించడంతో 1994 వరకు టీడీపీకి పోటీచేసే అవకాశం 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో నర్సాపూర్‌ నుంచి చిలుములమదన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. కాగా 2009 ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీడీపీతో సీపీఐ, టీఆర్‌ఎస్‌కు పొత్తు కుదరడంతో నర్సాపూర్‌ను సీపీఐకి కేటాయించారు. కూటమి అభ్యర్తిగా సీపీఐకి చెందిన చిలుములకిషన్‌రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు.

డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన జగన్నాథరావు..
నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చౌటి జగన్నాథరావు, ఒక సారి ఎమ్మెల్సీగా సైతం ఎన్నికయ్యారు. 1972లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. 1974లో తెలంగాణ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా సైతం నియమితులయ్యారు. కాగా 1980లో అంజయ్య క్యాబినెట్‌లో ఎక్సైజ్‌ మంత్రిగా పని చేశారు. 1982లో భవనం వెంకట్రాంరెడ్డి క్యబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. 

సీపీఐ శాసనసభా పక్షనేతగా విఠల్‌రెడ్డి
నర్సాపూర్‌కు చెందిన సీపీఐ నాయకుడు, దివంగత చిలుముల విఠల్‌రెడ్డి నర్సాపూర్‌ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ఆయన రాష్ట్ర శాసనసభ సీపీఐ పక్ష నాయకుడిగా, ఉప నాయకుడిగా వ్యవహరించి నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చారు. 

మంత్రిగా పని చేసిన సునీతారెడ్డి..
1999లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన సునీతారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2009లో రాష్ట్ర మైనర్‌ ఇరిగేషన్‌ మంత్రిగా పని చేశారు. 2010 నుంచి ఐకేపీ, పింఛన్‌లు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేíశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు.

తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజలు..
నర్సాపూర్‌ నియోజకవర్గం పలు ఉద్యమాలకు నెలువుగా నిలిచింది. 1969లో కొనసాగిన తొలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సైతం ఈ ప్రాంత వాసులు పాల్గొని తమ బాణీ వినిపించారు. కాగా మలిదశ ఉద్యమంలో సైతం ఈప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.

నర్సాపూర్‌ అడవులు నక్సలైట్లకు నెలవు..
గతంలో నర్సాపూర్‌ నియోజకవర్గంలోని అడవులు నక్సలైట్లకు కేంద్రాలుగా ఉండేవి. నియోజకవర్గ పరిధిలో నర్సాపూర్‌ ఏరియా దళంతో పాటు గుమ్మడిదల్ల ట్రేడే యూనియన్‌ దళాలు ఇక్కడ పని చేసేవి. కాగా కొల్చారం ఏరియాలో జనశక్తి నక్సలైట్ల ప్రాభల్యం ఉండేది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement