ఆరోగ్య ఉప జిల్లాలు | health sub-districts in telangana like tamilnadu | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ఉప జిల్లాలు

Published Thu, Mar 10 2016 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

ఆరోగ్య ఉప జిల్లాలు

ఆరోగ్య ఉప జిల్లాలు

 తమిళనాడు తరహాలో ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు తరహాలో తెలంగాణలో ఆరోగ్య ఉప జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఆశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి నేతృత్వంలో ఇటీవల తమిళనాడులో పర్యటించిన అధికారుల బృందం... అక్కడి ప్రభుత్వ ఆసుపత్రులు, రోగులకు అందుతున్న సేవలపై అధ్యయనం చేసింది. అక్కడి ప్రభుత్వ వైద్య సేవలు ఆదర్శనీయంగా ఉన్నాయని బృందం భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, వైద్య సేవల్లోనూ అనేక మార్పులు చేపట్టాలని యోచిస్తోంది. ఈ పర్యటనపై ప్రత్యేకంగా సమావేశమైన అధికారులు ప్రభుత్వానికి అనేక సిఫార్సులు చేశారు.

ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉండే డీఎంహెచ్‌వోనే పీహెచ్‌సీలు మొదలు అన్ని ఆసుపత్రుల పర్యవేక్షణ చేయాల్సి వస్తోంది. అన్నింటి పర్యవేక్షణ సాధ్యంకాక వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు మాదిరిగా ప్రతి జిల్లాలోనూ రెండు మూడు ఆరోగ్య ఉప జిల్లాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. ఒక్కో ఆరోగ్య ఉప జిల్లాకు ఒక డీఎంహెచ్‌వోను నియమిస్తారు. తమిళనాడులో ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్ కమిషనర్‌లు నెలకు దాదాపు 20 రోజులపాటు క్షేత్ర స్థాయిలో ఆసుపత్రులను పర్యవేక్షిస్తారు. ఈ అంశాన్ని కూడా మంత్రి బృందం పరిశీలనలోకి తీసుకుంది.

 మరికొన్ని కీలక సిఫార్సులివి...
వైద్య విధాన పరిషత్ పరిధిలోని 30 నుంచి 50 పడకలున్న అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ సంచాలకుల విభాగం పరిధిలోకి తేవాలి.

వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి గ్రామీణ ఆసుపత్రి సర్వీసుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి. దాని పరిధిలోకి 50 పడకలకు మించి ఉన్న అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను తీసుకురావాలి. తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక బోర్డును ఏర్పాటు చేయాలి. శాశ్వత, తాత్కాలిక పోస్టుల భర్తీలన్నీ కూడా అదే చేపట్టాలి. తెలంగాణ ప్రజారోగ్య చట్టాన్ని నెలకొల్పాలి. 150 మంది సీనియర్ ప్రజారోగ్య అధికారులను డిప్యూటీ డీఎంహెచ్‌వోలుగా మార్చాలి. వారికి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ తదితరాలపై పూర్తిస్థాయి ఆర్థిక, పరిపాలనాధికారాలు కల్పించాలి. ప్రసూతి సహా నవజాత శిశువుల సేవలకు ఇప్పుడున్న వాటిని హైరిస్క్ కేంద్రాలుగా మార్పు చేయాలి.

గర్భిణులు, పిల్లల ఆరోగ్య రక్షణకు కొత్తగా పథకాన్ని నెలకొల్పాలి. (తమిళనాడులో డాక్టర్ ముత్తులక్ష్మి పథకం ద్వారా వీరి సంరక్షణకు ఏడాదికి రూ.12 వేలు మూడు విడతలుగా ఇస్తున్నారు. మన ప్రభుత్వం రూ.1,000 మాత్రమే ఇస్తోంది.) జిల్లా ఆసుపత్రుల్లో తల్లి పాల కేంద్రాలు నెలకొల్పాలి.

 108 బైక్ అంబులెన్సులను తీసుకురావాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement