ఉన్నత విద్య కోసం జర్మనీకి.. | Hyderabad Students Interested Study in germany | Sakshi
Sakshi News home page

జర్మనీకి పోటెత్తుతున్న గ్రేటర్‌ విద్యార్థులు

Published Wed, May 1 2019 6:45 AM | Last Updated on Tue, May 7 2019 9:01 AM

Hyderabad Students Interested Study in germany - Sakshi

ఉన్నత విద్య కోసం జర్మనీకి గ్రేటర్‌ విద్యార్థులు పోటెత్తుతున్నారు. ఏటా వీరి సంఖ్య వేలల్లోపెరుగుతూనే ఉంది. మహానగరం పరిధిలోని డీమ్డ్‌వర్సిటీలు, వృత్తివిద్యా కళాశాలల్లో ఫీజులతో పోలిస్తే ఆ దేశంలో ట్యూషన్‌ ఫీజులు తక్కువగా ఉండటం.. సులభతరమైన వీసా నిబంధనలు, చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకొని జీవనానికి అవసరమైన వ్యయాన్ని సొంతంగా సంపాదించుకునే అవకాశం ఉండటంతో మెజార్టీ విద్యార్థులు ఆ దేశం వెళ్లేందుకుఆసక్తి కనబరుస్తున్నారు. మూడేళ్లుగా వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోందని విద్యాసంబంధిత కన్సల్టెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో :గ్రేటర్‌ విద్యార్థులు ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాతోపాటు ఇప్పుడు జర్మనీలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్లుగా వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరం నుంచి 2016లో సుమారు 13 వేల మంది, 2017లో 15 వేలు, 2018లో 17 వేల మంది జర్మనీలో వివిధ కోర్సులు అభ్యసించేందుకు వెళ్లినట్లు కన్సల్టెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. అత్యధికులు ఇంజినీరింగ్, మెడిసిన్, బయోటెక్నాలజీ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో జర్మనీకి చెందిన పలు వర్సిటీలు, విద్యాసంస్థల ప్రతినిధులు నగరంలో ప్రత్యేకంగా అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నగరంలోని గోహెతేజంత్రంలో డీఏఏడీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌(జర్మనీ విద్యాసంస్థ) ఇలాంటి సెమినార్‌ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల సందేహాలను అక్కడి విద్యాసంస్థల ప్రతినిధులు నివృత్తి చేశారన్నారు. జర్మనీలో ఉన్నత విద్యకున్న అవకాశాలు, ప్రత్యేకతలు, కోర్సులో అంతర్భాగంగా ఉండే సబ్జెక్టులు, వాటితో వారికి భవిష్యత్‌లో లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వీసా నిబంధనలు, అక్కడి భౌగోళిక పరిస్థితులు, జీవన వ్యయం, చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు వంటి అంశాలను వివరించినట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారితోపాటు పీహెచ్‌డీ కోసం జర్మనీ బాటపడుతున్నారని.. కొందరు ఇంటర్‌ తర్వాత విద్య కోసం వెళ్తున్నట్లు తెలిపారు. 

ఫీజులు తక్కువే..
నగరంలోని పలు ఇంజినీరింగ్, మెడిసిన్‌ కోర్సులతోపాటు డీమ్డ్‌ వర్సిటీల్లో ఉన్న ఫీజుల కంటే జర్మనీలో వివిధ కోర్సులకు ట్యూషన్‌ నామమాత్రం గానే ఉండటంతో పలువురు విద్యార్థులు జర్మనీ బాట పడుతుండటం విశేషం. విద్యార్థులు నెలకు కేవలం 700–800 యూరోలు(సుమారు రూ.54–62 వేలు) జీవన వ్యయం ఖర్చుచేస్తే సరిపోతుందని కన్సల్టెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. జీవన వ్యయాన్ని సొంతంగా సంపదించుకునేందుకు ఏటా 120 రోజులపాటు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు జర్మనీ చట్టాలు అనుమతి ఇస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థులు తమకు నెలవారీగా అయ్యే ఖర్చులను పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక జర్మనీలో ప్రతి వర్సిటీ అటానమస్‌ వర్సిటీయేనని.. ప్రతి వర్సిటీకి నిబంధనలు వేర్వేరుగా ఉన్నా.. విద్యార్థులకు ఫీజుల భారం అసలే ఉండదని తెలిపారు.

ప్రధాన కారణాలివే..
విద్యాసంబంధిత వీసా పొందేందుకు కేవలం 8–12 రోజుల సమయం పట్టడం.
వివిధ వృత్తి విద్య కోర్సులకు ట్యూషన్‌ ఫీజులు నామమాత్రంగా ఉండటం.  
ఏడాదికి 120 రోజులపాటు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ.. సొంతంగా జీవన వ్యయాన్ని సంపాదించుకునే అవకాశం.
జర్మనీ వీసా సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు: డబ్లు్యడబ్లు్యడబ్లు్య.చెన్నై.డీఐపీఎల్‌ఓ.డిఇ సైట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్పులు పొందాలనుకునేవారు సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.డీఏఏడీ.ఐఎన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ఫండింగ్‌గైడ్‌.డిఈ
ఆన్‌లైన్‌లోజర్మనీవిద్యావకాశాలుతెలుసుకునేందుకుడబ్లు్యడబ్లు్యడబ్లు్య.డీఏఏడీ.డిఇ/ఇంటర్నేషనల్‌ప్రోగ్రామ్స్‌లేదాడబ్లు్యడబ్లు్యడబ్లు్య.యూఎన్‌ఐ.అసిస్ట్‌.డిఇలేదాడబ్లు్యడబ్లు్యడబ్లు్య.స్టడీ.ఐఎన్‌.డిఇని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement