నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రి
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితిలోనూ పాక్ విద్రోహబుద్ధి మానలేదు. ఆపత్కాలంలోనూ దాని తలపుల్లో ‘వల’పు కుట్రే. కోవిడ్‌వేళ పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ కుట్రకోణాన్ని మన నిఘావర్గాలు బట్టబయలు చేశాయి. హరియాణాలో తీగ లాగితే తెలంగాణలో దాని డొంక కదిలింది. దేశంలో ఉగ్రకార్యకలాపాల ఉధృతికిగాను స్థానిక యువతను ఉగ్రవాదంవైపు నడిపించే కుట్రను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రాష్ట్ర నిఘావర్గాల సమాచారంతో పోలీసులు నిజామాబాద్‌లో భగ్నం చేశారు. గతేడాది నవంబరులో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీవోఐపీ) టెక్నాలజీ ద్వారా హనీట్రాప్‌తో హానీ తలపెట్టే కుట్ర చేసింది ఐఎస్‌ఐ. తాజాగా అలాంటి కుట్రే నిజామాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడింది.
భీంగల్ మండలం ముచ్‌కురు గ్రామానికి చెందిన సిద్ధిపల్లి అజయ్‌కుమార్ (32), సిద్ధిపల్లి వినయ్‌కుమార్ అన్నదమ్ములు. వీరు ఉపాధి కోసం సౌదీకి వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చారు. ఈ ఏడాది జనవరిలో నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ చంద్రశేఖర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అదే ఇంట్లో పలు నకిలీ సిమ్‌కార్డులు సేకరించి వీవోఐపీ సాంకేతికతతో ప్రైవేటు టెలిఫోన్ ఎక్సేంజ్ నిర్వహిస్తున్నారు. సౌదీలో ఉన్న సమయంలోనే వీరు అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చే వీఓఐపీ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు.
సాధారణంగా దేశంలోకి వచ్చే అనుమానాస్పద అంతర్జాతీయ కాల్స్‌పై నిఘావర్గాలు కన్నేసి ఉంచుతాయి. కానీ, లోకల్ కాల్స్‌పై అంతగా నిఘా ఉండదు. ఈ వెసులుబాటును ఆధారంగా చేసుకుని ఐఎస్‌ఐ నుంచి వచ్చే కాల్స్‌ను వీరు నిజామాబాద్‌లోనే లోకల్ కాల్స్‌గా మారుస్తున్నారు. దేశంలో ఉగ్రకార్యకలాపాలను నిఘా వర్గాలు గుర్తించకుండా ఆ కాల్స్‌ను భారత సైనికులను హనీట్రాప్(అమ్మాయిలతో మాట్లాడించి దేశ రహస్యాలు తెలుసుకుంటారు)లో దించడానికి, దేశంలోని తమ సానుభూతిపరులకు, వేర్పాటువాదులకు తాము ఇచ్చే ఆదేశాలు, చేసే ఆర్థిక సాయాలకు ఐఎస్‌ఐ దీన్ని వాడుకుంటోంది.
తెలంగాణలో కదిలిన డొంక..
హరియాణాలో కొంతకాలంగా ఐఎస్‌ఐ ప్రేరేపిత ఓ వేర్పాటువాద సంస్థ కదలికలు ఊపందుకున్నాయి. కానీ, వీరికి ఎలాంటి అంతర్జాతీయ కాల్స్ రావడం లేదు. అనుమానంతో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నిఘా పెట్టింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న కాల్స్‌ను నిజామాబాద్‌లో లోకల్ కాల్స్‌గా మారుస్తూ వాటిని హరియాణాకు మళ్లిస్తున్నారని గుర్తించింది. ఐబీ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన హైదరాబాద్‌లోని టెలికాం అధికారులు నిజామాబాద్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ అన్నదమ్ములను అరెస్టు చేసి కుట్రను ఛేదించారు. వారిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment