సాక్షి, కరీంనగర్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక శాఖలను కేటాయించారు. గతంలో ఆయన పనిచేసిన ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్, మైనింగ్ శాఖలను అప్పగించారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా 2009లో గెలుపొందిన కేటీఆర్ వరుసగా 2010, 2014, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనకు రెండోసారి అవేశాఖలు కేటాయించారు.
2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విడత మంత్రివర్గంలో కేటీఆర్‌కు అవకాశం లభించలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌కు అవకాశం రాగా.. రెండో విడతలో కేటీఆర్‌కు అవకాశం ఇస్తూ.. మళ్లీ పాత శాఖలనే కేటాయించారు.
గంగులకు బీసీ సంక్షేమం,పౌరసరఫరాలు..
కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్‌కు మంత్రివర్గంలో అనూహ్యంగా అవకాశం లభించింది. మున్నురుకాపు సామాజికవర్గానికి చెందిన గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమంతోపాటు, పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖలను కేటాయించారు. ఆయనకు తొలిసారి మంత్రిగా అవకాశం లభించింది. 2009లో కరీంనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల, 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేశారు. కరీంనగర్‌స్థానంలో టీఆర్‌ఎస్ పట్టు నిలుపుకునేందుకు మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించినట్లు సమాచారం. గంగుల కమలాకర్‌కు మంత్రివర్గంలో స్థానం లభించడంతో కరీంనగర్ ఆ పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది.
సీఎంను కలిసిన ఈటల..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం కలిశారు. మంత్రివర్గ విస్తరణకు ముందు ఈటల ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంను కలవడం చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ టీఆర్‌ఎస్ సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాజేందర్ మంత్రివర్గ విస్తరణకు ముందే సీఎంను కలువడంతో ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈటల సంచలన వ్యాఖ్యల అనంతరం సీఎంను కలువడం ఇదే ప్రథమం. కొత్తగా ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రానికి కొత్తగా వచ్చిన గవర్నర్‌తో కలిసి రాష్ట్ర మంత్రులు ఫొటోలు దిగారు. దీంతో ఈటల మాటల ఎపిసోడ్ ముగిసినట్లుగా టీఆర్‌ఎస్‌వర్గాలు భావిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాకు సముచిత స్థానం..
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రా ష్ట్ర మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది. నలుగురికి మంత్రివర్గంలో స్థానం దక్కడం విశేషం. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ ఒక్కరే ఎమ్మెల్యే కాగా.. అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.
కరీంనగర్ సింహగర్జన సభ నుంచి కేసీఆర్ దీక్ష వరకు టీఆర్‌ఎస్‌కు అండగా ఉండే కరీంనగర్ జిల్లాకు రాష్ట్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలు లభించాయి. కేటీఆర్‌కు అధికంగా నాలుగు పాత శాఖలు లభించగా.. మిగితా ముగ్గురికి కీలకమైన శాఖలు దక్కాయి. జిల్లాలోని పెద్దపల్లికి చెందిన ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్‌రావును శాసన మండలి విప్‌గా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment