సాక్షి, కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్యా కేంద్రంలోని వివిధ విభాగాల్లో గత ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న దినసరి, లంప్సమ్, టైంస్కేల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. ఈనెల 28వ తేదీ నుంచి వివిధ రూపాల్లో దశలవారీ ఆందోళనలు చేపడుతామని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఆదాయంలో యూనివర్సిటీకి వాటా
కేయూ దూరవిద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ల కోర్సులను నిర్వహిస్తున్నారు. గతంలో ఫీజులు, ఇతర రూపాల్లో రూ.13 కోట్ల నుంచి రూ.14కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే, ఇది రెండు, మూడేళ్లుగా కొంత తగ్గుముఖం పట్టినా దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌గా జి.వీరన్న బాధ్యతలు చేపట్టాక మళ్లీ ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. ఇక దూరవిద్య కేంద్రం ద్వారా వస్తున్న ఆదాయంలో ఏటా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు యూనివర్సిటీ అవసరాలకు తీసుకుంటున్నారు. గత ఏడాదైతే రూ.10కోట్లు వరకు తీసుకున్నారు. ఇటీవల మరో రూ.కోటి వరకు నిధులను యూనివర్సిటీ అవసరాలకు తీసుకున్నారు.
అయితే, నిధులను తీసుకుంటున్న యూనివర్సిటీ అధికారులు.. ఎస్‌డీఎల్‌సీఈలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరిచండంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనుభవం, అర్హతలు ఉన్న నాలుగో తరగతి ఉద్యోగులను ఎన్‌జీఓలుగా గుర్తించాలని, పన్నెండేళ్ల సర్వీస్ దాటిన లంప్సమ్ ఉద్యోగులను దినసరివేతన ఉద్యోగులుగా, దినసరి వేతన ఉద్యోగులను టైం స్కేల్ ఉద్యోగులుగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు దూరవిద్య కేంద్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయడమే కాకుండా బ్యాక్ లాగ్‌పోస్టులను కూడా భర్తీచేయాలని కొంతకాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పలు సార్లు ఆందోళనలు చేపట్టారు కూడా.
కాకతీయ యూనివర్సిటీ పలు విభాగాల్లోని దినసరి ఉద్యోగుల వేతనాలను ఏటా జిల్లా కలెక్టర్ పెంపుదల చేస్తారు. అయితే, ఈ పెంపును యూనివర్సిటీలోని అన్ని విభాగాలతో పాటు దూరవిద్య కేంద్రంలోని దినసరి వేతన ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలి. కానీ 2018కి సంబంధించిన వేతనాలను దూరవిద్య కేంద్రం ఉద్యోగులకు వర్తింపచేయకపోవడంతో పలుమార్లు వీసీ, రిజిస్ట్రార్‌ను కలవగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఉన్నతాధికారులు అంగీకరించటం లేదని చెప్పార. దీంతో కొద్దిరోజుల క్రితం వివిధ సంఘాల బాధ్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి సమస్యను వివరించారు.
అదనపు రెమ్యూనరేషన్ ఏదీ?
దూరవిద్య కేంద్రంలోని వివిధ కేటగిరీల ఉద్యోగులకు ఎక్స్‌ట్రా రెమ్యూనరేషన్‌ను కూడా ఏటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఇవ్వకపోవడంతో దూరవిద్య ఉద్యోగులసంఘం బాధ్యులు, ఉద్యోగులు దూరవిద్య కేంద్రం డెరెక్టర్ ఆచార్య జి.వీరన్న కలిసి విన్నవించినా పరిష్కారానికి నోచుకోలేదు. ఇక గతంలో దినసరి వేతన ఉద్యోగులెవరైనా మరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబంలో ఒకరికి మళ్లీ దినసరి వేతన ఉద్యోగిగా . కానీ ఇప్పుడు లంప్సమ్ ఉద్యోగిగా నియమిస్తుండడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. దీనికి 20 ఏళ్లుగా పని చేసిన వారికి కూడా రెగ్యులరైజ్ చేయటంలేదు. దీంతో కొందరు టైంస్కేల్, దినసరి వేతన ఉద్యోగులుగానే ఉద్యోగ విరమణ పొందారు. ఫలితంగా పెన్షన్ అందక వారు దుర్భర జీవితం గడపాల్సి వస్తోంది.
కాగా, ఉద్యోగ విరమణ పొందిన వారికి రూ.5లక్షలు మాత్రమే ఇస్తుండగా.. దీనిని పెంచాలనే డిమాండ్ కూడా ఇక వివిధ కేటగిరీలో పనిచేస్తూ పీహెచ్‌డీ పూర్తి చేసిన వారిని కోఆర్డినేటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ కూడా నెరవేరడం లేదు. ఉద్యోగంలో ఉండి ప్రమాదవశాత్తు మరణించిన వారికి బీమా సౌకర్యం కల్పించడం లేదు. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న దూర విద్య కేంద్రం ఉద్యోగులు.. పరిష్కారంలో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతున్నారు. ఇటీవలే కొన్ని ఉద్యోగసంఘాలు జేఏసీగా ఏర్పాటై రిజిస్ట్రార్ కె. పురుషోత్తంకు కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే, ఈనెల 28నుంచి ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే అంధకారం
దూరవిద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరిం చటంలో యూనివర్సిటీ అధికారుల నాన్చుడు« ధోరణి అవలంభిస్తున్నా రు. క్యాంపస్‌లోని ఇతర ఉద్యోగులతో సమానంగా మమ్ముల్సి చూడడం లేదు. దూర విద్య కేంద్రం ద్వారా వచ్చే వనరులను యూనివర్సిటీకి ఉపయోగించుకుంటూ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. హక్కులు, సమస్యలపై అధికారులను ప్రశ్నిస్తే కక్ష సా« దింపు చర్యలకు దిగుతున్నారు. దీంతో సమస్యల పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈనెల 28నుంచి ఆందోళనలు నిర్వహించనున్నాం.
– డాక్టర్ శాగంటి శ్రీనివాస్, అధ్యక్షుడు, దూరవిద్య ఉద్యోగుల సంఘం
ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
ఇప్పటికైనా అధికారుల స్పందించి కేయూ దూరవిద్య ఉద్యోగులలను రెగ్యులరైజ్ చేయాలి. గత 15 ఏళ్ల నుంచి 20ఏళ్ల వరకకు కూడా వివిధ కేటగిరీలో పని చేస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ విషయంలో యూనివర్సిటీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటంలేదు. ఫలితంగా రెగ్యులరైజ్ కాకుండానే చాలా మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఇకనైనా మా ఇబ్బందులను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం.
– ఉప్పుల రవి, ప్రధాన కార్యదర్శి, దూరవిద్య ఉద్యోగుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment