కలసి పనిచేద్దాం రండి !: నాయిని నర్సింహారెడ్డి | Maoists come and join in society, calls Nayani Narasimha reddy | Sakshi
Sakshi News home page

కలసి పనిచేద్దాం రండి !: నాయిని నర్సింహారెడ్డి

Published Sat, Jun 7 2014 1:46 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

కలసి పనిచేద్దాం రండి !: నాయిని నర్సింహారెడ్డి - Sakshi

కలసి పనిచేద్దాం రండి !: నాయిని నర్సింహారెడ్డి

* మావోయిస్టులకు ప్రభుత్వం ఆహ్వానం   
* మన ఎజెండా ఒకటే: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
* అభివృద్ధి, సంక్షేమాలతో అసమానతలు దూరం చేస్తాం
* ప్రజా పోలీస్ వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడి

 
సాక్షి,హైదరాబాద్: ‘అభివృద్ధి, సంక్షేమాలను పక్కాగా అమలు చేస్తూ కుల, మత, పేద, పెద్ద అంతరాల్లేని సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. అందరి భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ ఆధ్వర్యంలోని తొలి ప్రభుత్వం వివక్ష, దాపరికం, అవినీతి లేని స్వచ్ఛమైన పాలన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సర్కార్ నిర్ణయాల్లో ప్రతివారి మనోభావాలు ప్రతిబింబిస్తాయి. అందుకే సమాజానికి దూరంగా, ప్రజాస్వామ్య వ్యవస్థకు భిన్నంగా వ్యవహరిస్తున్న శక్తులన్నీ ఇప్పుడు ఏకం కావాలి.
 
 అందులో భాగంగానే నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలసి రావాలి’ అని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ లక్ష్యాలు ప్రాధమ్యాలను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదుల ఉనికి లేదని అయినా ఈ భావజాలంతో ఉన్న మేధావులు, సానుభూతిపరులు సైతం తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకుంటే వాటిని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భూమి, నీరు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో వివక్ష లేకుండా ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేస్తుందని నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు.
 
 దళితుల వ్యవసాయభారం సర్కారుదే
 దళితుల వ్యవసాయ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి చెప్పారు. మూడు ఎకరాల వరకు భూమి కలిగిన దళిత రైతుల క్షేత్రాలను సేద్యయోగ్యంగా తీర్చిదిద్ది బోరు, మోటారు ప్రభుత్వమే ఇప్పించి, సంవత్సరం పాటు నిర్వహించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వారికి తిరిగి అప్పగిస్తుందని నాయిని వెల్లడించారు. అదే విధంగా కుల, మత బేధాలు లేని పాఠశాలల ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలు విద్య, ఉపాధి రంగాల్లో ముం దుండేలా  చూస్తుందన్నారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌లో ఐటీఆర్ ప్రాజెక్ట్ ఏర్పాటు, సింగరేణిలో కొత్త గనుల తవ్వకం తదితర పనులతో భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, విద్యావంతులు ఉద్యోగం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదన్నారు.
 
 సచార్ అమలుతో.. ఇస్లామిక్ టైజానికి చెక్
 విద్య, ఉపాధి రంగాల్లో నిర్లక్ష్యానికి గురయ్యామన్న ఆందోళనలతో అడ్డదారి పడుతున్న మైనారిటీ యువజనాన్ని వారి కుటుంబాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని నాయిని చెప్పారు. ముస్లింల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన సచార్ కమిటీ సూచనల అమలుకు రూ.1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీపడబోమని, అసాంఘిక శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
 
 ప్రజాపోలీస్ వ్యవస్థ ఏర్పాటు
 పోలీసులంటే.. ప్రజామిత్రులనే నినాదాన్ని ప్రచారం చేస్తామన్నారు. పోలీసుల్లో అంకితభావం, చిత్తశుద్ధిని నింపుతూ,  వారాంతపు సెలవు, కుటుంబసభ్యులతో గడిపే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నాయిని చెప్పారు. ట్రాఫిక్ సిబ్బందికి స్పెషల్ మెడికల్ అలవెన్స్ అందజేస్తామన్నారు. పోలీస్ స్టేషన్లపై ప్రస్తుతం ఉన్న అభిప్రాయాన్ని సరిదిద్దుతామన్నారు. త్వరలో 24 జిల్లాల పునర్విభజనతోపాటు పోలీస్ డివిజన్లు, స్టేషన్ల పునర్విభజన జరుగుతుందని, తగినంత సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. సీమాంధ్ర జిల్లాల నుండి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రభుత్వాన్ని వారు ఆదరించాలని నాయిని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంక్రాంతి పండుగకు సీమాంధ్రకు వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వమే ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఇక్కడ స్థిరపడినవారిలో కొందరు ఇక్కడ ఒక ఓటు, తిరిగి సీమాంధ్రలో ఒక ఓటు వేసి ఓ పార్టీ గెలుపునకు కారణమయ్యారన్న సమాచారం తమవద్ద ఉందని, అలాంటి వారు ఏదో ఒకచోట మాత్రమే ఓటును నమోదు చేసుకుంటే మంచిదని నాయిని హితవు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement