పాఠశాలల్లోకి మినీ అంగన్‌వాడీలు
► విలీనానికి ఏర్పాట్లు
► ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 1,217 కేంద్రాలు
► నివేదికల తయారీలో అధికారులు నిమగ్నం
ఖమ్మం: ఉమ్మడి జిల్లాల్లోని మినీ అంగన్‌వాడీలు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం కానున్నాయి. ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కేజీ టూ పీజీ పథకంలో భాగంగా వీటిని పాఠశాలల్లో విలీనం చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కనుమరుగవుతాయి. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల హోదాను కూడా మార్చిన విషయం విదితమే. ఖమ్మం జిల్లాలో 817, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 626 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
ఈ కేంద్రాలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఐసీడీఎస్ అధికారులు ఏయే కేంద్రాలు పాఠశాలలకు దగ్గరగా ఉన్నాయో నివేదికలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో మినీ అంగన్‌వాడీ సెంటర్లను పాఠశాలలకు తరలించే పనిలో పడ్డారు. కొన్ని కేంద్రాలు సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోకి తరలిపోయాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి చిన్నారులకు ఆ పాఠశాలల్లోనే విద్యాబోధన జరగనుంది.
అంగన్‌వాడీల హోదా మార్పు..
మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లోకి మార్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటికే ఈ కేంద్రాల్లో పాఠాలు బోధించిన అంగన్‌వాడీల హోదాను మార్పు చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలుగా ఉన్న వీరిని అంగన్‌వాడీ టీచర్లుగా మార్చిన విషయం తెలిసిందే. దీంతో వీరు ఇకనుంచి పాఠశాలల్లో పాఠాలు బోధించాల్సి ఉంటుంది.
తప్పని పనిభారం..
ఇప్పటి వరకు మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసిన అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పడం, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం వంటి పనులు చేసేవారు. అయితే ఇప్పుడు వీరిని పాఠశాలల్లో టీచర్లుగా నియమించడంతో.. అటు సమయం ప్రకారం పాఠాలు బోధించడంతోపాటు ఇటు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పనులు కూడా చేయాల్సి ఉంటుంది. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, వారికి పిల్లల పెంపకం, గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దీంతో వీరికి పనిభారం పడనుంది.
అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేనా..?
ఇప్పటికే మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేస్తుండడంతో అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి అయోమయంగా మారింది. ఈ కేంద్రాలను కొనసాగిస్తారా..? లేక ఎక్కడైనా విలీనం చేస్తారా..? అని ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు ఆలోచనలో పడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతో పిల్లలకు పౌష్టికాహారంతోపాటు వారు పాఠశాలలకు అలవాటు పడేవారు.
ఇప్పుడు ఈ కేంద్రాలను విలీనం చేయడంతో పిల్లలను నేరుగా పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. దీంతో నిరుపేద కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడం, పాఠశాలలకు పిల్లలు అలవాటు పడకపోవడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చని పలువురు అంటున్నారు.