18 సంవత్సరాలు నిండకుండానే.. | Minors Driving Vehicles in Nagarkurnool | Sakshi
Sakshi News home page

కట్టడి ఏదీ?

Published Thu, Dec 12 2019 11:21 AM | Last Updated on Thu, Dec 12 2019 11:21 AM

Minors Driving Vehicles in Nagarkurnool - Sakshi

వాహనాలు నడుపుతున్న మైనర్లు

నాగర్‌కర్నూల్‌ క్రైం: తెలిసీ, తెలియని వయసులో మైనర్లు రోడ్లపై వాహనాలతో చక్కర్లు కొడుతూ ఆనంద పడుతున్నారు. అనుకోని సంఘటనలు జరిగి రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఈ ఆనందం కాస్త ఆవిరికావాల్సి వస్తుంది. చాలా రోజుల నుంచి నియోజకవర్గ పరిధిలో రోడ్లపై వాహనాలతో మైనర్లు హల్‌చల్‌ చేస్తూ.. వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. రోడ్లపై మైనర్లు వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమైతే శిక్షను తల్లిదండ్రులు అనుభవించాల్సి వస్తుంది. జిల్లా కేంద్రంలో కొందరు మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా, మరికొందరు మైనర్ల తల్లిదండ్రులే తమ పిల్లలకు వాహనాలను ఇచ్చి రోడ్లపైకి పంపుతున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన లేక మైనర్లు ఇష్టారీతిగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. 

18 సంవత్సరాలు నిండకుండానే  
చాలా మంది మైనర్లు 18 సంవత్సరాలు నిండకుండానే వాహనాలు నడుపుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు వయస్సు లేదని తెలిసి కూడా వారే స్వయంగా వాహనాల్లో వెనుక కూర్చొని తమ పిల్లలతో వాహనాలను నడిపించి ఆనందపడుతున్నారు. కొందరు మైనర్లు పాఠశాలలకు ద్విచక్రవాహనాలను తీసుకుని వెళ్తున్నారు. టూవీలర్, ఫోర్‌ వీలర్‌ వాహనాలను నడపాలంటే 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు రవాణా శాఖ ద్వారా జారీ చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పొందిన తర్వాత మాత్రమే వాహనాలను నడపాలి.  

కౌన్సెలింగ్‌ ఇచ్చినా..
పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడుతూనే ఉన్నారు. తనిఖీల సమయంలో పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ఇచ్చినా పరిస్థితి మారడం లేదు. పోలీస్‌శాఖ ఇచ్చిన కౌన్సెలింగ్‌లను మైనర్ల తల్లిదండ్రులు పెడచెవిన పెట్టి  తమ పిల్లలు మేజర్లు కాకుండానే, డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండానే రోడ్లపైకి వాహనాలను తీసుకెళ్తుంటే చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

కట్టడి చేయకుంటే కష్టమే.. 

మైనర్ల తల్లి›దండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు రాకుండా వాహనాలు నడపుతుంటే కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మైనర్ల దశలో ఉన్న పిల్లలకు ఆలోచన శక్తి తక్కువగా ఉండటంతో రోడ్లపైకి వాహనాలు తీసుకెళ్లడం లాంటివి చేస్తే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కొందరు మైనర్లు వాహనాలను వేగంగా నడుపుతూ పాదాచారులకు, వాహనదారులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. మైనర్ల తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.  

తల్లిదండ్రులే బాధ్యత వహించాలి
18 సంవత్సరాలు నిండకుండా మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తనిఖీల సమయంలో వాహనాలు నడుపుతూ.. పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – మాధవరెడ్డి, ఎస్‌ఐ, నాగర్‌కర్నూల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement