సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధి కూలీలపై సర్కారు లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వేలాది కూలీలతో పని చేయించిన ప్రభుత్వం.. వారికి డబ్బులివ్వడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. నెలలు గడుస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో జిల్లాలో వేలాది కూలీలు
తమ శ్రమఫలం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పని చేసిన ఉపాధి కూలీలకు యంత్రాంగం డబ్బులు చెల్లించలేదు. ఇందుకు సంబంధించి దాదాపు రూ. 6.69 కోట్లు బకాయిలున్నట్లు తెలుస్తోంది.
సాకులతో సర్దుబాటు..
వాస్తవానికి ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీకి గరిష్టంగా వారం రోజుల్లో డబ్బులు చెల్లించాలి. కానీ జిల్లాలో మాత్రం నెలలు గడుస్తున్నా డబ్బులివ్వకపోవడంతో జిల్లా వ్యాప్తం గా దాదాపు 38,846 మంది కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరిలో చాలా మంది 2013-14 ఆర్థిక సంవత్సరంలో పని చేసిన కూలీలుం డడం గమనార్హం. అయితే నిధులు లేకపోవడంతో పంపిణీ నిలిచిందందటూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ పేర్కొం టోంది. ఎన్నికలు, కొత్త బడ్జెట్ నేపథ్యంలో ఈ సమస్య తలెత్తిందంటూ అధికారులు చెబుతున్నప్పటికీ..అందుబాటులో ఉన్న కొద్దిపాటి నిధులను కూడా కూలీలకు చెల్లించలేకపోయారు. కూలీలకు స్మార్ట్‌కార్డు ఖాతాలు లేకపోవడంతో వారికి డబ్బులివ్వలేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఖాతాలు తెరవడంలోనూ నిర్లక్ష్యమే..
ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల చెల్లింపుల ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా కొనసాగుతోంది. కూలీలకు స్మార్ట్‌కార్డు ద్వారా ఈ చెల్లింపులు వారి ఖాతా నుంచి చేస్తారు. జిల్లాలో ఈ ప్రక్రియ అంతా మణిపాల్ అనే పంపిణీ సంస్థ చూసుకుంటోంది. ఉపాధి పనికి వచ్చిన కూలీ వివరాలు వెంటనే నమోదు చేసుకుని వారికి స్మార్ట్‌కార్డుతో పాటు ఖాతా నెంబరు ఇవ్వాల్సి ఉండగా.. పంపిణీ సంస్థ నిర్లక్ష్యంతో జిల్లాలో వేలాది మంది కూలీలకు ఇప్పటివరకు ఖాతాలు తెరవలేదు. దీంతో కూలీలు చేసిన పనికి సంబంధించిన నిధులు వచ్చినప్పటికీ ఖాతాలు లేని కారణంగా పంపిణీ ప్రక్రియ స్తంభించింది.
దీంతో పలుచోట్ల కూలీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంత కదలిక వచ్చింది. 38వేల మంది కూలీలకు గాను 23వేల మంది కూలీలకు తాత్కాలిక ఖాతా నంబర్లతో నిధులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరో నాలుగు వేల మందికి పూర్తిస్థాయి ఖాతాలున్నాయి. దీంతో ఈ 27వేల మంది కూలీలకు త్వరలో డబ్బుల్లు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. మరో 11,846 మందికి సంబంధించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారుల వద్ద స్పష్టత లేకపోవడం గమనార్హం. వీరి బకాయిలు రూ.2.19 కోట్లున్నాయి. ఈ అంశంపై డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డిని వివరణ కోరగా నిధులు వచ్చాయని, వెంటనే చెల్లింపులు చేస్తామని ‘సాక్షి’తో పేర్కొన్నారు.
ఉపాధి నిధులు.. హామీతో సరి!
Published Wed, Jul 16 2014 1:35 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement