- జాతీయ కుటుంబలబ్ధి పథకానికి మెరుగులు
- బాధిత కుటుంబాల వద్దకే యంత్రాంగం
- అర్హతను నిర్ధారించి సత్వర ప్రయోజనమే లక్ష్యం
- ఓఎస్‌డీలకు విచారణ బాధ్యతలు
- నూతన విధానానికి కలెక్టర్ శ్రీకారం
కుటుంబయజమాని చనిపోయిన ఫ్యామిలీకి చేయూతనిచ్చేందుకు కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన జాతీయ కుటుంబలబ్ధి పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) అమలులో లోపాలను సరిదిద్దాలని యంత్రాంగం నిర్ణయించింది. కుటుంబ పోషకుడి మరణంతో వీధినపడిన ఆ కుటుంబ సభ్యులను ఆదుకోకుండా.. కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన
- కలెక్టర్ రఘునందన్‌రావు ఎన్‌ఎఫ్‌బీఎస్ అమలులో జాప్యాన్ని నివారించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.
- గతేడాది జూన్ 2 నుంచి జిల్లాలో చనిపోయిన వారి జాబితాను సేకరించిన అధికారులు.. వీరందరికీ ఏకకాలంలో
- రూ.10వేల ఆర్థికసాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఎన్‌ఎఫ్‌బీఎస్ కింద రూ.10వేలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కుటుంబ పోషకుడు చనిపోయినట్లు స్థానిక అధికారులు నిర్ధారిస్తేనే ఈ పథకానికి అర్హులు. అది కూడా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపువారికే వర్తిస్తుంది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఈ పథకం కింద 2013 -14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 30 మందికే ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణలోని పది జిల్లాల్లో కేవలం 1,800 మందికి మాత్రమే సాయం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ఈ పథకం నీరుగారుతోంది.
ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్.. ఎన్‌ఎఫ్‌బీఎస్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు కొత్త ప్రయోగం చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చనిపోయిన వారి జాబితా.. ఆ కుటుంబం సమగ్ర వివరాలను సేకరించాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సేకరించిన ఈ మాచారాన్ని ఓ ఫార్మెట్‌లో పొందుపరిచి దాన్ని మంగళవారం మండలాల్లో పర్యటించే ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)లకు అప్పగించారు. వీరు చనిపోయిన కుటుంబంలో ప్రస్తుతం పోషకులెవరనే అంశాన్ని గుర్తించి.. వారి ఫొటో, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా సంఖ్యను సేకరిస్తారు. ఈ సమాచారం మేరకు గుర్తించిన లబ్ధిదారులకు ఎన్‌ఎఫ్‌బీఎస్ కింద రూ.10వేలను మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు.
బాధిత కుటుంబాలను దరఖాస్తుల పేర కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదనే ఉద్ధేశంతో.. వారి దరికే పాలనా యంత్రాంగం వెళ్లేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా దరఖాస్తు చేసుకోనివారికి కూడా మేలు జరుగుతుందని, అర్హులందరికీ న్యాయం చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో గుర్తించిన 1,800 మంది జా బితాల్లో తప్పులు దొర్లితే సవరిస్తామని, జాబితాలో పేర్లు లేనివారిని కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
ప్రీమెట్రిక్ ఉపకారవేతనాలకూ..
ఎన్‌ఎఫ్‌బీఎస్ తరహాలోనే ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్పుల అమలుకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులందరి ఆధార్, బ్యాంక్‌అకౌంట్ వివరాలు సేకరించడం ద్వారా ఉపకార వేతనాలలో అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ఆయన భావిస్తున్నారు.
సరికొత్తగా ‘కుటుంబ లబ్ధి’
Published Wed, Apr 29 2015 1:16 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement
Advertisement