‘సర్కారీ' బోధన ఎలా?
- ప్రభుత్వ స్కూళ్లలో 900కుపైగా టీచర్ పోస్టులు ఖాళీ
- ఐదు రోజుల్లో తెరచుకోనున్న స్కూళ్లు
- అయోమయమంలో జిల్లా విద్యాశాఖ
- ఆందోళనలో తల్లిదండ్రులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టుల కొరత తీవ్రంగా ఉంది. దాదాపు 900 పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యాశాఖ అధికారులు అయోమయం చెందుతున్నారు. మరో ఐదు రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానుండగా...ఆయా పాఠశాలలో బోధన ఎలా కొనసాగించాలని వారు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు తమ పిల్లల చదువులు ఎలా సాగుతోయోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే సర్కారు స్కూళ్లలో విద్య అంటేనే జనం ఆసక్తి చూపడం లేదు. పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగా లేకపోవడం, టీచర్ల కొరత, చదువుపై అధికారుల పర్యవేక్షణ కొరవడడం.. ఫలితంగా ఉత్తీర్ణత శాతం ఏటేటా తగ్గుతూ వస్తోంది. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాలు కూడా అందుకు ఉదాహరణ . జిల్లాలో 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా... వాటిలో 51.97 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో వందల కొద్ది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడం సమస్య మరింత జఠిలం కావడానికి దోహదపడుతోందని విద్యావేత్తలు అంటున్నారు.
ఖాళీలు ఇలా...
జిల్లాలో 712 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా.. అందులో 526 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత, 183 ఉన్నత పాఠశాలలు. ఈ స్కూళ్ల పరిధిలో దాదాపు 940 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్లు విద్యాశాఖాధికారుల అంచనా. ఇందులో దాదాపు 600 ఎస్‌జీటీ , స్కూల్ అసిస్టెంట్ (సబ్జెక్ట్ టీచర్స్) 160, భాషా పండితులు 110, పీఈటీ 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఖాళీల సంఖ్యపై మరింత స్పష్టత రానుంది.
ఈ ఏడాది 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని ఖాళీ పోస్టులపై చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో స్కూళ్ల వారీగా జిల్లా విద్యాశాఖాధికారులు డేటా సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 900కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ)కి అధికారులు పంపినట్లు సమాచారం. తాజాగా రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ)కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తియితే ఖాళీల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటాయి.
తరగతుల నిర్వహణ కష్టమే...
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో డీఎస్సీ ప్రకటన ముడిపడి ఉంది. హేతుబద్ధీకరణకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఉపాధ్యాయుల భర్తీకి సర్కారు సుముఖంగా ఉన్నప్పటికీ.. ఈఏడాది రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఖాళీ పోస్టులనే భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో శాఖలు, జిల్లాల వారీగా చూసుకుంటే పోస్టుల భర్తీ సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది.
ఈ లెక్కన హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల విషయంలోనూ ఇదే జరగనుంది. ఉన్న ఖాళీల్లో 10 - 20 శాతం పోస్టులు భర్తీ అయితే మహాగొప్ప. మరోపక్క విద్యావలంటీర్లు, కాంట్రాక్ట్ టీచర్ల నియామకంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. బడులు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పిల్లలకు పాఠ్యాంశాలు ఎలా బోధించాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.