సమరమే! | Nominations Starts In Telangana Elections | Sakshi
Sakshi News home page

సమరమే!

Published Tue, Nov 13 2018 9:49 AM | Last Updated on Tue, Nov 13 2018 9:49 AM

Nominations Starts In Telangana Elections - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన రోజే నగరంలో నామినేషన్ల సందడి మొదలైంది. మెజారిటీ నియోజకవర్గాల్లో సోమవారం నామినేషన్లు దాఖలు కానప్పటికీ... తొలిరోజే బీజేపీ అభ్యర్థులు నామినేషన్‌ కార్యక్రమాలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఇష్టదైవమైన లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌ గంగారం, ఎంపీ దత్తాత్రేయ, నాయకులు మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డిలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి తన నామినేషన్‌ దాఖలు చేశారు. గోషామహల్‌లో రాజాసింగ్‌ లోథా, మలక్‌పేట్‌లో ఆలె జితేంద్ర, చార్మినార్‌లో ఉమామహేంద్ర నామినేషన్‌ వేశారు. అయితే అధికారికంగా ఇంకా ఖరారు కానప్పటికీ ఆకుల విజయ  సైతం బీజేపీ అభ్యర్థిగా పేర్కొంటూ సనత్‌నగర్‌ లో నామినేషన్‌ వేయడం గమనార్హం. నగరంలో బీజేపీ అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్‌ వేయడం తో ఆయా నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలతో సందడి నెలకొంది. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎల్బీనగర్‌లో రామ్మోహన్‌గౌడ్‌ సాదాసీదాగా నామినేష న్‌ వేయగా, ఉప్పల్‌లో ఆ పార్టీ రెబల్‌గా నందికొం డ శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. శేరిలింగంపల్లిలో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి తాండ్ర కుమా ర్‌ నామినేషన్‌ వేశారు. సోమవారం మంచిరోజు అనే కారణంతో మిగిలిననియోకజవర్గాల్లోని అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్లారు. 

ప్రజాకూటమి రె‘ఢీ’....   
కాంగ్రెస్‌ సోమవారం తొలి జాబితాను ప్రకటించింది. కుత్బుల్లాపూర్, మహేశ్వరం, ముషీరాబాద్, నాంపల్లి, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్‌– కంటోన్మెంట్‌ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసింది.

టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ...  
టీఆర్‌ఎస్‌ విషయంలో నగరంలోని మరికొన్ని స్థానాలపై స్పష్టత రావాల్సి ఉండడంతో కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఖైరతాబాద్‌ దానం నాగేందర్‌కు కేటాయిస్తున్నారన్న ప్రచారంతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అనుచరులు సోమవారం టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇక మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్, అంబర్‌పేటలో కాలేరు వెంక
టేష్‌ల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మేడ్చల్‌లో ఎంపీ మల్లారెడ్డి అభ్యర్థిత్వం ఖరారైనప్పటికీ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో సంప్రదింపులు పూర్తయిన తర్వాత నామినేషన్‌ వేయాలని నిర్ణయించారు.  

కూటమిలో కిరికిరి...    
ఓవైపు నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. టికెట్ల కిరికిరి మాత్రం తారాస్థాయికి చేరుకుంది. కూటమి భాగస్వామ్య పక్షాల ఆశావహులు ఆందోళనకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు గాంధీభవన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తుండగా, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ఎదుట ఆందోళన చేస్తున్నాయి. అగ్రనాయకులు సర్దిచెబుతున్నా వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు. గ్రేటర్‌లో పాతబస్తీ మినహా మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీకి గట్టి పట్టు ఉంది. తాజాగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమిగా ఏర్పడడంతో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కూటమిలో టీడీపీకి 14సీట్లు ఖరారవ్వగా, వాటిలో ఏడు నగర పరిధిలోనే కేటాయించే అవకాశాలు లేకపోలేదు. ఈ ఏడింటిలో నాలుగైదు చోట్ల కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు కొత్తగా ఆవిర్భవించిన టీజేఎస్‌ కూడా నగరంలోని రెండు సీట్లపై దృష్టి సారించింది.   

అవకాశం రాకుంటే.?   
ప్రజాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా అవకాశం రాకుంటే భవిష్యత్తు కార్యాచరణకు ఆశావహులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అవకాశం రాని అభ్యర్థుల అడుగులు ఎటువైపు పడతాయన్నది చర్చనీయాంశమైంది. ఇదే సరైన సమయమని భావిస్తున్న కొందరు పార్టీ తరఫున అవకాశం రాకుంటే ఇతర గుర్తులపై అయినా బరిలో దిగే అంశాన్ని పరిశీలిస్తున్నారు. బీజేపీ, బీఎస్‌పీ, లోక్‌జనశక్తి తదితర పార్టీల నుంచి ఆఫర్లు వస్తుండడంతో అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement