![Pocharam Srinivas Reddy Election Campaign in Nizamabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/25/POO.jpg.webp?itok=jWeC89X7)
సభలో మాట్లాడుతున్న పోచారం శ్రీనివాస రెడ్డి
మొన్నటి వరకు ప్రచారంలో కాస్త జోరు తగ్గించిన టీఆర్‌ఎస్ మళ్లీ వేగం పెంచింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన విమర్శలను తిప్పికొడుతున్నారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ వంటి హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తున్నారు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్‌ఎస్ మలి విడ త ప్రచారం మళ్లీ జోరందుకుంది. ఈనెల మొదటి వారంలో నగరంలో అధినేత కేసీఆర్ భారీ బహిరంగసభ అనంతరం ప్రచారంలో కొంత జోరు తగ్గించిన ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు వేగం పెం చారు. గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూనే ఆయా గ్రామాలు, మండల కేంద్రా ల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడతో పాటు, ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిçస్తున్నారు.
ఆయా చోట్ల ప్రచార సభలను నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డికి మద్దతుగా నందిపేట్‌లో నిర్వహించిన సభలో పోచారం పాల్గొన్నారు. అలాగే మంగళవారం కామారెడ్డిలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ రాహుల్ సభకు కౌంటర్‌గా..
కాంగ్రెస్ పార్టీ శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బహిరంగసభను నిర్వహించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి శ్రేణులను ఈ సభకు తరలించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రాహుల్ విమర్శలను టీఆర్‌ఎస్ అభ్యర్థులు తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ వంటి హామీలపై స్పందించిన పోచారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ హామీలను ఎందుకు నెరవేర్చడం లేదనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూనే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.
ఏకపక్షంగా టీఆర్‌ఎస్ ప్రచారం..
టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం దాదాపు ఏకపక్షంగా సాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులెవరో ఇంకా పూర్తి స్థాయిలో తేలలేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీలు జిల్లాలోని కేవలం మూడు చొప్పున నియోజకవర్గాల్లోనే ప్రచారం చేస్తోంది. బోధన్, ఆర్మూర్, కామారెడ్డి నియోజకవర్గాల్లోనే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రచారం పరిమితం కాగా, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, కామారెడ్డి నియోజకవర్గంల్లో బీజేపీ అభ్యర్థుల ప్రచారం సాగుతోంది. మిగితా చోట్ల ఒక్క టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రమే ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇతర జిల్లాల మంత్రులతో..
ఇతర జిల్లాలకు చెందిన మంత్రులతోనూ ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గం లక్కోరలో ఏఎన్‌సీ గార్డెన్‌లో నియోజకవర్గ స్థాయి గొల్ల, కుర్మ, యాదవ్ ఆత్మీయ సమావేశం ఆ పార్టీ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment