సాగు.. ఏం బాగు? | reduced budgetary allocation to agriculture sector | Sakshi
Sakshi News home page

సాగు.. ఏం బాగు?

Published Tue, Mar 14 2017 2:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సాగు.. ఏం బాగు? - Sakshi

సాగు.. ఏం బాగు?

వ్యవసాయానికి గతేడాది కంటే తగ్గిన బడ్జెట్‌ కేటాయింపులు
గత బడ్జెట్‌ రూ.6,758 కోట్లు
ఈసారి బడ్జెట్‌లో రూ. 5,942 కోట్లే
ఇందులో రుణమాఫీకి కేటాయించిన నిధులే రూ.4 వేల కోట్లు
మిగిలిన రూ.1,942 కోట్లే వ్యవసాయానికి వాస్తవ కేటాయింపులు
ఉద్యాన శాఖకు కోతలు.. పాలీహౌస్‌కు రూ.70 కోట్లు మాత్రమే
యాంత్రీకరణకు 300 కోట్లు.. పశుసంవర్థక శాఖకు రూ.594 కోట్లు
గొర్రెల పంపిణీకి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు


హైదరాబాద్‌: ఒకవైపు కాలం కలసి రావడం.. మరోవైపు ఎన్నడూ లేనంతగా భారీగా పంటలు సాగవుతున్న నేపథ్యంలో రైతుకు చేయూతనివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై శీతకన్ను వేసింది. 2016–17 బడ్జెట్లో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ రంగాలకు రూ.6,758 కోట్లు కేటాయించగా.. 2017–18 బడ్జెట్లో రూ.5,942 కోట్లకు కుదించింది. గతం కంటే ఈసారి రూ.816 కోట్లు తగ్గిపోవడం గమనార్హం. ఈ కేటాయింపుల్లోనూ రూ.4 వేల కోట్లు రుణమాఫీకే పోతుంది. మిగిలిన రూ.1,942 కోట్లు మాత్రమే వ్యవసాయ రంగానికి వాస్తవ కేటాయింపుగా భావించాల్సి ఉంటుంది. రుణమాఫీ నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులతో కలిపి వ్యవసాయ శాఖకు రూ.4,823 కోట్లు కేటాయించారు.

ఇక ఉద్యాన శాఖకు రూ.207 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015–16లో పాలీహౌస్‌ల నిర్మాణానికి రూ.250 కోట్లు.. 2016–17లో రూ.200 కోట్లు కేటాయించగా.. ఈసారి ఏకంగా రూ.70 కోట్లకు కుదించారు. అంటే పాలీహౌస్‌ను ప్రభుత్వం నిరుత్సాహపరచాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈసారి బట్జెట్‌లో ప్రభుత్వం వెయ్యి ఎకరాల్లో పాలీహౌస్‌ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డు నుంచి రూ.వెయ్యి కోట్లు రుణంగా పొందినందున ఉద్యాన శాఖకు తక్కువ కేటాయిం పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. రెండేళ్లుగా పాలీహౌస్‌లకు బకాయిలు రూ.200 కోట్ల వరకు పేరుకు పోవడంతో ఆ సొమ్ము ఎలా ఇవ్వాలో అంతుబట్టడంలేదని అధికారులు అంటున్నారు. ఇక వ్యవసాయ యాంత్రీకరణకు గత బడ్జెట్‌ కంటే అధిక నిధులు ఇచ్చారు. 2016–17 బడ్జెట్లో రూ.250 కోట్లుండగా.. ఈసారి రూ.300 కోట్లు కేటాయించారు. మార్కెటింగ్‌ శాఖకు రూ.457.29 కోట్లు కేటాయించారు.

పశుసంవర్థక శాఖకు రూ.594 కోట్లు
ప్రగతి, నిర్వహణ పద్దుల కింద పశుసంవర్థక శాఖకు రూ.594.74 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.333 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.261 కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దులో వెటర్నరీ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు రూ.25 కోట్లు.. కోళ్లు, పశువుల ఉత్పత్తి ప్రోత్సాహకాలకు రూ.43 కోట్లు.. పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీకి రూ.21.25 కోట్లు కేటాయించారు. అయితే విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకపు సొమ్మును బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తోన్న గొర్రెల పంపిణీకి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. వాటిని జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) ద్వారా అప్పు తీసుకుని ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందువల్లే బడ్జెట్లో ప్రస్తావించలేదని భావిస్తున్నారు. మత్స్య శాఖ అభివృద్ధికి.. రూ.60.50 కోట్లు.. సహకార శాఖకు రూ.5.58 కోట్లు కేటాయించారు.

ముఖ్య కేటాయింపులివీ..
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.300 కోట్లు
సన్నచిన్నకారు రైతుల పంటల బీమాకి రూ.200 కోట్లు
వడ్డీలేని రుణాలు, పంటల బీమాకు రూ.250 కోట్లు
రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీకి 126.61 కోట్లు
ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీకి 85.50 కోట్లు
శ్రీకొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీకి రూ.12.60 కోట్లు
ఉద్యాన శాఖ కార్యకలాపాలకు రూ.17 కోట్లు
వేర్‌హౌసింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.349.88 కోట్లు
సూక్ష్మసేద్యం కోసం రూ.56 కోట్లు
బ్లూ రెవెల్యూషన్‌ కోసం రూ.19.54 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement