రెవెన్యూ మాయ
కరీంనగర్ రూరల్ :
రెవెన్యూ అధికారుల అక్రమాలు కొంతపుంతలు తొక్కుతున్నాయి. మనవడిని తాతగా చూపించి పహణీల్లో పేర్లు మార్చిన అధికారులు ఏకంగా ఓ రిటైర్డ్ ఎ మ్మార్వో సంతకంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా జారీ చేశారు. పహణీల్లో పేరెలా మార్చారని బాధితుడు ప్రశ్నిస్తే తమ వద్ద ఎలాంటి రికార్డులు లేవని చేతులెత్తేస్తున్నారు. బాధితుడు కరీంనగర్ మండలం నగునూరుకు చెందిన సాంబశివరావు కథనం ప్రకారం... నగునూరులో జీవీ సాంబశివరావుకు వందలాది ఎకరాల భూములుండేవి.
1950లో అతడి కుమారుడు సదాశివరావుకు వారసత్వం కింద వివిధ సర్వేనంబర్లలోని 105 ఎకరాల భూమి వాటాగా వచ్చింది. అనంతరం ఈ భూములు అతడి కుమారుడు సాంబశివరావుకు ద క్కాయి. 1955 నుంచి 1997-98 వరకు పహణీల్లో సాంబశివరావు పేరే నమోదై ఉంది. అనంతరం భూముల ధరలు పెరగడం, సాంబశివరావు స్థానికం గా లేకపోవడంతో అతడి సోదరులు ఈ భూములపై కన్నేశారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సర్వేనంబర్ల వారీగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.
తాతా మనవళ్లది ఒకే పేరు
తాతా మనవళ్లు పేర్లు సాంబశివరావు కావడం రెవె న్యూ అధికారులకు కలిసొచ్చింది. వారసత్వ ధ్రువీకరణ పేరిట అసలు పట్టాదారుడిని పక్కదారి పట్టిం చారు. తాత జీవీ సాంబశివరావు నుంచి తండ్రి సదాశివరావు పొందిన భూములకు వారసుడిగా మనవడు సాంబశివరావు పేరు 1998 వరకు పహణీల్లో రాగా మనవడు సాంబశివరావునే తాతగా చూపించి అతడి వారసులుగా పేర్కొంటూ సోదరుల పేర్లను అధికారులు పహణీల్లో నమోదు చేశారు.
రిజిష్టర్లు లేవట..
1955 నుంచి 1998 వరకు పహణీల్లో ఉన్న సాంబశివరావు పేరు స్థానంలో 1999, 2000, 2001 పహణీల్లో అతడి సోదరులు వీర లక్ష్మీకాంతరావు, కిషన్‌రావు, రంగారావు పేర్లను అధికారులు నమోదు చేశారు. తన పేరుకు బదులు సర్వేనంబర్లు 380 నుంచి 425, 431, 432 నుంచి 442, 443లో ఇతరుల పేర్లు ఎలా నమో దు చేశారో చెప్పాలంటూ సాంబశివరావు 2008 లో జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే 1998నుంచి 2000 వరకు మార్పుల రిజిష్టర్లు లభిం చడం లేదంటూ డెప్యూటీ తహశీల్దార్ సమాధానమిచ్చారు.
దీంతో ఆయా సంవత్సరాల పహణీ నకళ్లు ఇవ్వాలని గతనెలలో దరఖాస్తు చేసుకో గా 1995- 96 నుంచి 2000-2001 వరకు పహణీలు, 1బీ రిజిష్టర్లు, 1ఏ రికార్డులు అందుబాటులో లేనందున జారీ చేయడం సాధ్యం కాదంటూ సమాధానమిచ్చారు.
రిటైర్డు ఎమ్మార్వో సంతకంతో పాస్‌బుక్కులు
పహణీల్లో అక్రమంగా పేర్లు నమోదు చేయడమే కాకుండా ఓ రిటైర్డ్ ఎమ్మార్వో సంతకంతో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం అధికారుల అవినీతికి తార్కాణం. కరీంనగర్ ఎమ్మార్వోగా రాజయ్య 1996 వరకు పనిచేసి రిటైర్ కాగా, లక్ష్మీకాంతరావు, కిషన్‌రావు, రంగారావుకు రాజయ్య సంతకాలతో 2000లో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కావడం గమనార్హం. పాసుపుస్తకాలపై పట్టానంబర్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై కలెక్టర్ సమగ్ర విచారణ నిర్వహించి తనకు న్యాయం చేయాలని బాధితుడు సాంబశివరావు విజ్ఞప్తి చేస్తున్నాడు.