ఫిట్‌నెస్ పరీక్షల సందర్భంగా బస్సు రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలిస్తున్న ఆర్టీఏ అధికారులు (ఫైల్)
మహబూబ్‌నగర్ క్రైం : పిల్లలు బడికి వెళ్లడం ఎంత ముఖ్యమో.. తిరిగి ఇంటికి రావడం అంతే ముఖ్యం. ఇందుకు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల బంగారు భవిష్యత్ దృష్ట్యా రూ.లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు చదివిస్తుండగా.. బాధ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు రవాణా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
కాలం చెల్లిన, సామర్థ్యం లేని బస్సులు, వాహనాల్లో పిల్లలను పాఠశాలలకు చేరవేస్తున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక పిల్లలు ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు ఆందోళనగా గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏటా మాదిరిగానే ఈసారి కూడా వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు చేయాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దరఖాస్తు గడువు మంగళవారం ముగియనుండగా, బుధవారం నుంచి తనిఖీలు జరగనున్నాయి.
తక్కువ సమయం
గతంలో జూన్ 12న పాఠశాలల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేది. దీంతో దీంతో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించడానికి నెల రోజుల సమయం ఉండేది. కానీ ఈసారి జూన్ 1నే పాఠశాలల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 16వ తేదీ నుంచి బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభిస్తే పదిహేను రోజుల సమయం కూడా ఉండదు.
అయితే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బస్సులు 932 ఉన్న నేపథ్యంలో రోజుకు 58 వరకు బస్సుల ఫిట్‌నెస్‌ను పరీక్షించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇది సాధ్యం కాదని.. తద్వారా ‘మామూలు’గానే తనిఖీలు నిర్వహిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 932 బస్సులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి 1,025 బస్సులు ఉన్నాయి. ఇందులో 93 బస్సులు పదిహేనేళ్ల కాలపరిమితి దాటేశాయి. దీంతో ఈ బస్సులకు సంబంధించి ఫిట్‌నెస్ పరీక్ష కోసం దరఖాస్తు వచ్చినా చేయొద్దని అధికారులు నిర్ణయించారు. ఇక మిగిలిన అన్ని బస్సులకు సంబంధించి యాజమాన్యాలు ఫిట్‌నెస్ పరీక్ష చేయించాలి.
ఇందుకోసం తొలుత రిప్రజెంటేటివ్ బై, డిజిగ్నేషన్, సెల్ నంబర్, విద్యాసంస్థ ఈ మెయిల్ ఐడీ, వెబ్‌సైట్ అడ్రస్ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అందే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ నమోదు చేస్తే రవాణా శాఖ కార్యాలయం నుంచి ఏ రోజు ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకావాలో సమాచారం అందుతుంది. ఇంకా బస్సు వివరాలు, అటెండెంట్, డ్రైవర్ వివరాలు, వారి ఫొటోలతో పాటు ఏ రూట్‌లో బస్సు తిరుగుతుంది, ఎందరు విద్యార్థులను చేరవేస్తారనే వివరాలను కూడా పొందుపర్చాలి.
ఇక ఆర్టీఏ అధికారులు వాహనం ఫిట్‌నెస్‌ను పరీక్షించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా బస్సుల్లో కిటికీలు, సీట్లు, మెడికల్ కిట్లు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా, లేదా అనేది పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇక జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు తనిఖీలు చేపట్టి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేస్తారు.
నిబంధనల మేరకు
రాష్రంలో ఏదో ఓ చోట ప్రైవేట్ పాఠశాలల బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఫిట్‌నెస్ చేయించకుండానే బస్సుల రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా యజామాన్యాల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. ఈ మేరకు చిన్నారుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాలని నిర్ణయించింది.
కార్యాలయాల్లో సిబ్బంది కొరత
ఉమ్మడి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల డీటీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంవీఐలకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చి కాలం గడుపుతున్నారు. మహబూబ్‌నగర్ డీటీఓగా ఉన్న మమతా ప్రసాద్‌కు జేటీసీగా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో ఆమె హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు.
ఉమ్మడి జిల్లాలో ఆర్టీఏలో వివిధ రకాల పోస్టులు 53ఉండగా వాటిలో 32మంది పని చేస్తుంటే మరో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 32మంది ఉద్యోగుల్లో నలుగురు డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాలకు వెళ్లారు. అంటే మొత్తంగా నాలుగు జిల్లాలకు 28 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా ఎంవీఐ, ఏఓ, ఏఎంవీఐ, సీనియర్ అసిస్టెంట్లు, కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రస్తుతం శాఖలో పని చేస్తున్న 28 మంది ఉద్యోగుల్లో మహబూబ్‌నగర్‌లో 13మంది, నాగర్‌కర్నూల్‌లో ఆరుగురు, వనపర్తిలో ముగ్గురితో పాటు జోగుళాంబ గద్వాలలో ఆరుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో పరిపాలనాధికారి పోస్టు ఖాళీగా ఉంది. మహబూబ్‌నగర్‌లో ఒకరు ఎంవీఐ, నలుగురు ఏఎంవీఐలు, వనపర్తిలో ఒక రు ఎంవీఐ, గద్వాల ఒకరు ఎంవీఐ, నాగర్‌కర్నూల్ లో ఒక ఎంవీఐ, ఒక ఏఎంవీఐలు పని చేస్తు న్నారు.
ఉమ్మడి జిల్లాలోనే పని చేయడానికి అశించిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఇప్పటికే ఇబ్బందులు దురవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల తనిఖీలు చేయడం సమస్యగా మారుతుందోనే ఆందోళన వ్యక్తమవుతోంది.
నిబంధనలు విస్మరిస్తే కఠిన చర్యలు
ఇద్దరు ఎంవీఐలతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేస్తాం. జూన్ 1 నుంచి బస్సుల తనిఖీలు చేపట్టి ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపైకి వచ్చినట్లు తేలితే సీజ్ చేస్తాం. అనుమతులు లేకుండా పాఠశాల బస్సులు నడిపినా, నిబంధనలు విస్మరించినా కఠిన చర్యలు తప్పవు. పాఠశాల బస్సులకు సంబంధించి నిబంధనల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. విద్యార్థుల సంరక్షణకు ప్రభుత్వ సూచనలన్నీంటినీ పాఠశాలల యాజమాన్యాలు ఖచ్చితంగా పాటించాలి. – మమతాప్రసాద్, డీటీసీ, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment