ఒంటరి పోరాటమే | Single Fight Tours | Sakshi
Sakshi News home page

ఒంటరి పోరాటమే

Published Tue, Sep 16 2014 2:40 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

ఒంటరి పోరాటమే - Sakshi

ఒంటరి పోరాటమే

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయాలని నగర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కష్ట సమయంలో స్నేహధర్మం పాటించకుండా టీఆర్‌ఎస్‌తో జట్టు కట్టిన ఎంఐఎంతో అమీతుమీ తేల్చుకోవాలని నాయకులు తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత సోమవారం నిర్వహించిన గ్రేటర్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల తొలి సమావేశంలో పార్టీ అగ్రనేతలు దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు, పొన్నాల, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్ తదితరులు శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. నగరంలో కాంగ్రెస్ పొత్తుతోనే ఎంఐఎం ఈ స్థాయికి చేరుకుందని, జీహెచ్‌ఎంసీ ఛైర్‌పర్సన్ విషయంలోనూ మూడేళ్లు కాంగ్రెస్, రెండేళ్లు ఎంఐఎంలు పదవి చేపట్టాలని తొలుత నిర్ణయించామని గుర్తు చేశారు.

ఎంఐఎం కోరిక మేరకు చివరి ఏడాది వారికే పదవిని ఉదారంగా వదిలామన్నారు. అయినా సాధారణ ఎన్నికల్లో చేయిచ్చారంటూ పార్టీ నాయకులు అంజన్‌కుమార్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి తదితరులు నిష్టూరమాడారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాపోరాటాలకు సన్నద్ధం కావాలని, గడువులోగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించే దిశగా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీలో ఎంఐఎం పాలకవర్గ నిర్ణయాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే ఆమోదం తెలిపేలా కార్పొరేటర్లు వ్యవహరించాలని నిర్ణయించారు.
 
ముఖ్య నేతల డుమ్మా: జీహెచ్‌ఎంసీ ముఖ్య నాయకుల సమావేశానికి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, జయసుధ, శంకర్‌రావు హాజరు కాలేదు.  
 
మండపాలకు అనుమతి తప్పనిసరి

సాక్షి, సిటీబ్యూరో: దసరా నవరాత్రి సందర్భంగా దుర్గామాత అమ్మవారి విగ్రహాలను నెలకొల్పే మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మండపాలు నెలకొల్పే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సంబంధిత డివిజన్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని, పోలీసు వెబ్‌సైట్‌లో కూడా లభిస్తాయని ఆయన తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement