త్వరలో జిల్లా నందనవనంగా మారనుంది. ప్రతి మూలన పచ్చలహారం పరచడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ కింద జిల్లావ్యాప్తంగా 2.34 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించింది. జూలై 3 నుంచి 10వ తేదీ వరకు ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలని నిర్ణయించిన యంత్రాంగం.. దీంట్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా శనివారం జెడ్పీ హాల్‌లో ప్రజాప్రతినిధులతో హ రితహారం అమలుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
- సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి జిల్లావ్యాప్తంగా ఏడు వేల హెక్టార్లలో మొక్కలు నాటాలని సూత్రప్రాయంగా ప్రతిపాదనలు తయారు చేశారు. దీంట్లో ప్రభుత్వ స్థలాల్లేకుండా.. పారిశ్రామిక అవసరాలకు నిర్దేశించిన స్థలాలూ ఉన్నాయి. వీటి తోపాటు 315 కిలోమీటర్ల పొడవున ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకిరువైపులా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 2,982 కి.మీ మేర పంచాయతీరాజ్ మార్గాలు, 60కి.మీ. మున్సిపల్ రహదారులు.. ఇలా ప్రతి దారికి రెండువైపులా పచ్చదనం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
‘ఉపాధి’కే మొక్కల సంరక్షణ
నియోజకవర్గానికి 40లక్షల మొక్కల చొప్పున నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న యంత్రాంగం.. వీటి సంరక్షణను ఉపాధి కూలీలకు అప్పగించాలని యోచిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్)లో మొక్కల పెంపకానికి (వాచ్ అండ్ వార్డ్) ప్రత్యేక పద్దు ఉన్నందున.. వీటిని హరితహారం మొక్కల సంరక్షణకు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. మొక్కల సంఖ్యను బట్టి కూలీని నిర్ధారిస్తామని, బ్లాకులు, బహిరంగ ప్రదేశాల్లో మొక్కల పోషకులకు ఉపాధి కూలీలను నియమిస్తామని చెప్పారు. ప్రైవేటు సం స్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మొక్క ల నిర్వహణను ఆయా సంస్థలే చూసుకోవాలని స్పష్టం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో వనాల సంరక్షణ బాధ్యత అటవీశాఖదేనని చెప్పారు. సాగర్ హైవేకిరువైపులా హరితహారం మొక్కల నిర్వహణ బాధ్యత ఆర్‌అండ్‌బీకి అప్పగించినట్లు ఆయన వివరించారు.
జిల్లా వైశాల్యం 7.49 లక్షల హెకార్లు. ఇందులో 9.75% మాత్రమే అట వీ విస్తీర్ణం ఉంది. అటవీ ప్రాంతం వెలుపల సుమారు 3.45% చెట్లు ఉన్నాయి. అంటే జిల్లాలో 13.20 శాతం మాత్రమే పచ్చదనం ఉందన్నమాట. జిల్లా భూభాగంలో 33.33 శాతం ఉద్యానం కావాలంటే మిగతా 20.13శాతం ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు హరితహారం కార్యక్రమంలో 2.34 కోట్ల మొక్కల (26 వృక్ష జాతులు)కు ఊపిరిలూదడానికి ప్రణాళిక తయారు చేశారు.
ఏజెన్సీ= మొక్కలు (లక్షల్లో)
సామాజిక అడవులు (రంగారెడ్డి జిల్లా)= 80
హైదరాబాద్ (ప్రాదేశిక)= 50
నీటి యాజమాన్యసంస్థ= 102
ఉద్యానశాఖ= 2
హరితవిల్లు
Published Sat, Jun 27 2015 12:33 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement