సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్‌కు ముందే జరగొచ్చనే ప్రచారం ఊపందుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ నియోజకవర్గాల్లోనే తిష్ట వేస్తున్నారు. ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లోనే జరిగే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో నేతలందరూ అప్రమత్తమయ్యారు. నియోజకవర్గాల్లో జరిగే ప్రతీ చిన్న కార్యక్రమానికి అధికార, ప్రతిపక్షాల నేతలు హాజరవుతున్నారు. మరోవైపు వచ్చే నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఒక్కసారిగా జూలు విదులుస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ముమ్మరంగా శంకుస్థాపనలు చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏకంగా మంత్రులు విస్తృత పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద అధికార, ప్రతిపక్ష నేతల çసుడిగాలి పర్యటనలతో పల్లె, పట్నం తేడా లేకుండా రాజకీయ సందడి నెలకొంది.
టీఆర్‌ఎస్ సన్నద్ధం
అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎన్నికలకు అప్పుడే సన్నద్ధమవుతున్నారు. వచ్చే డిసెంబర్ నెలలోనే ఎన్నికలు జరగనున్న ఆ పార్టీ అధిష్టానమే సంకేతాలు ఇస్తోందని తెలుస్తుండగా.. అందుకు అనుగుణంగా వచ్చే సెప్టెంబర్‌లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు స్వయంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీనికి తోడు సెప్టెంబర్ నెలాఖరు లోపు ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు అధికార ఎమ్మెల్యేలకు సంకేతాలు అందాయని తెలుస్తోంది. ఈ మేరకు నియోజకవర్గాల్లో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే విధంగా జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ సి.లక్షా్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు సైతం తమ నియోజకవర్గాల్లోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిపక్ష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల విషయంలో అధికార పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అయిదు చోట్ల ప్రాతినిధ్యం వహిస్తోంది. గద్వాలలో డీకే.అరుణ, వనపర్తిలో జి.చిన్నారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి, కల్వకుర్తిలో వంశీచంద్‌రెడ్డి, అలంపూర్‌లో ఎస్.ఎ.సంపత్‌కుమార్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల విషయంలో టీఆర్‌ఎస్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల సమీక్షలు, లబ్ధిదారులకు పంపినీ తదితర వాటిల్లో మంత్రులు ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డిలు గద్వాల, కొడంగల్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
వనపర్తి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి పర్యటనల జోరు పెంచారు. వీటికి తోడు సర్వేల ఆధారంగా కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్న గద్వాల, కొడంగల్ నియోజకవర్గాల విషయంలో టీఆర్‌ఎస్ మరింత శ్రద్ధ కనబరుస్తోంది. ఆయా నియోజకవర్గాలపై స్వయంగా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావు ద్వారా నివేదికలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా గద్వాలలో జరిగిన బహిరంగసభలో స్వయంగా సీఎం కేసీఆర్ పాల్గొని టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే కొడంగల్‌లో ఇటీవలి కాలంలో ఒకేసారి ముగ్గురు మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పర్యటించారు.
మెజార్టీ సీట్లపై దృష్టి
ఉమ్మడి పాలమూరు జిల్లాపై అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు భారీ ఆశలు పెట్టుకున్నాయి. పాలమూరులో సహజంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. అందుకు అనుగుణంగానే గత సాధారణ ఎన్నికల్లో కూడా మం చి ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ హవా కొనసాగినా... పాలమూరులో మాత్రం కాంగ్రెస్ ఎదురొడ్డి నిలి చింది. దీంతో ఈసారి కూడా సెంటిమెంట్‌కు అనుగుణంగా మంచి ఫలితాలు సాధించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనతో కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
ఇదిలా ఉంటే... అధికార టీఆర్‌ఎస్ తమ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఈసారి పాలమూరులో మంచి ఫలితాలు సాధించేందుకు కొంత కాలంగా గట్టి కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో కేవలం ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానా న్ని మాత్రమే గెలుచుకుంది. అలా కాకుండా ఈసారి మె జారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహ రచన చేసింది. అందుకు అనుగుణంగా అభ్యర్థుల విషయంలో కూడా అనేక జా గ్రత్తలు తీసుకుంటుంది. ఇలా మొత్తం మీద ఇరు పార్టీల ముమ్మర కసరత్తుతో ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా వేడి నెలకొంది.
మిగతా పక్షాలు సైతం సై
అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు బలమైన పోటీ ఇచ్చేందుకు మిగతా రాజకీయ పక్షాలు సైతం ‘సై’ అంటున్నాయి. బీజేపీ, వైఎస్సార్ సీపీ, టీడీపీ, టీజేఎస్, వామపక్షపార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇటీవలి కాలంలో విపక్షాలన్నీ కూడా పోటీ పడుతున్నాయి. నిరుద్యోగ యువత విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంతకాల సేకరణ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ పార్టీ నేతలు ఉమ్మడి జిల్లాలోని అర డజను నియోజకవర్గాల్లో గట్టి పోటీని ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కసరత్తు చేస్తున్నారు.. అలాగే బీజేపీ కూడా సంస్థాగతంగా మరింత బలోపేతమవుతూ... పాత ఫలితాలను సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. అలాగే టీజేఎస్, టీడీపీ, వామపక్షపార్టీలు సైతం ముందస్తు ఎన్నికలకు అనుగుణంగా సిద్ధమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment